ఆంధ్రలిపి పరిణామము
పరిణామ దృష్టిలో మహత్తరమైనది. లిపి పరిణామదృష్టిని గూడ నిదియొక చరిత్రాత్మక ఘట్టము. ఏలయన, ఇంత
వరకు తెలుగు కన్నడముల కొకేలిపి యుండెడిది. అనగా నన్నయభట్టు ఉపయోగించిన లిపియందే కన్నడకవిత్రయపు
వారి రచనలును వ్రాయబడినవి. తిక్కన కాలమున తెలుగు లిపి ప్రత్యేక స్వరూపము దాల్చి కన్నడమునుండి వేరుపడి
నది. కొంత కాలము తెలుగు కన్నడముల కొకేలిపి యుండిన కారణముననే నేటికికూడ కొన్ని తెలుగు తాళపత్ర ప్రతులు కన్నడలిపిలో కానవచ్చుచున్నవి. తిక్కన కాలమునాటి పాత తెలుగులిపి శ్రీనాథుని కాలమునాటికి వ్రాత పరికరముల కారణమున సర్వాంగ సుందరమై ముత్యాలచాలువలె ముచ్చట గూర్ప సాగినది.
తెలుగులిపి తొలుత నలుచదరముగ నుండెడిదనియు, ఆ వెనుక గుండ్రదనముకలిగి లిపిగా పరిణామము పొందిన దనియు, ముందు చెప్పబడినది. దీనికి కారణము మన వ్రాతసాధనములే యని చెప్పవచ్చును. మొదట మన వ్రాతసాధనము - శిల - లేక రాయి. వీటిపైని చెక్కబడిన వ్రాతలకే "శిలాశాసనములు" అని పేరు. ఇది శిలా యుగము లేక రాతియుగము యొక్క చిహ్నము. ఆపైని రాగి రేకులు ప్రచారములోనికి వచ్చి వ్రాతసాధనములై నవి. ఇది లోహయుగము లేక ఇనుపయుగ చిహ్నము అని చెప్పవచ్చును. రాగిరేకులు ప్రచారములోనున్న కాలముననే తాటియాకు ప్రధానమయిన వ్రాతసాధనముగా పరిణమించినది. అప్పుడే చతురస్రముగా నుండెడు మన లిపి గుండ్రదనము దాల్చుచు వచ్చినది.
శిలలపైని, రాగిరేకులపైని ఉలితో అక్షరములు చెక్కెడివారు. చతురస్రముగనుండు లిపిని అట్లు ఉలితో చెక్కుట సులభము - చతురస్రముగ నుండు లిపిలో అక్షరములకు తలకట్లు అడ్డుగీతవలె అనగా ನಿಟ್ಟಿ యాకారముతో నుండును. తాటియాకు ప్రచారము లోనికి రాగానే దానికి ఉలివలె చివర భాగమున నుండి కొంచెము పొడుగుగానుండు మరియొక వ్రాతసాధనము కావలసివచ్చెను. దానినే గంటము అందురు. గంటముతో తాటియాకుమీద వ్రాయునప్పుడు తలకట్లు గీతవలె వ్రాసినచో తాటియాకు చినిగిపోవును. కాబట్టి యవి గుండ్రముగా వ్రాయవలసిన యావశ్యకత యేర్పడినది. దానినిబట్టి అక్షరములకును గుండ్రదన మేర్పడినది.
మన లిపిచరిత్రను పరిశీలించినచో క్రీ. శ. 1000-1050 ప్రాంతము అనగా నన్నయభట్టారకుని కాలమునుండి ఈ గుండ్రదనము ప్రారంభమైన ట్లాతని నందమపూడి శాసనము తెలుపుచున్నది.
తిక్కన కాలమునాటికి మన తెలుగులిపి గుండ్రదనము చేత నొక విశిష్టత సంపాదించినది. దాక్షిణాత్యలిపులలో తెలుగునకు గల యీ విశేషమును, తిక్కన కాలమునాటి కవియగు మంచన కేయూరబాహు చరిత్రమున నిట్లు వ్యక్తముచేసి యున్నాడు.
కృతపతియగు గుండనామాత్యుడు “వాచకత్వము లేఖ నోచితంబును నంధ్రలిపిరితిగా సర్వ లిపులయందు, ఫణితి భాతియుఁ దీవ్రభంగియు" వ్రాయగలిగినవాడట (1-18).
శ్రీనాధుని కాలమునాటికి తెలుగులిపి, యొకకళగా పరిగణిత మైనది. కుడియెడమల రెండు చేతులతోడను వ్రాయగల వ్రాయసకాండ్రు ఉండెడివారు. జక్కన విక్రమార్క చరిత్రలో
"ఆత్మీయ లిపియట్టు లన్య దేశంబుల
లిపులను జదువంగ నిపుణుఁడయ్యె" (1-50)
శా. శ్రీ కర్ణాట మహామహీశ్వర
సదా సేవా ప్రధానో త్తమా
నీ కస్తుత్యలిపి క్రియానిపుణ పాణి
ద్వంద్వ పంకేరుహా.(3-137)
అని లిపినిగూర్చి తెలిపినాడు. శ్రీకృష్ణరాయని యుగమున - లిపి పరిణతి చెందినది. పాండురంగమాహాత్మ్యమున రామకృష్ణకవి —
“పట్టెవట్రువయును పరిపుష్టి తలకట్టు
గుడిసున్న కియ్యయు సుడియు ముడియు
నైత్వంబు నేత్వంబు నందంబు మందంబు
గిలుకయు బంతులు' నిలుపు పొలుపు
నయము నిస్సందేహతయు నొప్పు మురువును
ద్రచ్చి వేసినయట్లు తనరుటయును
షడ్వర్గశుద్ధియు జాతియోగ్యతయును
వృద్ధిప్రియంబును విశదగతియు...”
గలిగి తెలుగులిపి కళాసంపన్నమైనది.