ఆంధ్రదేశ చరిత్రము . IV
కూలుడు. నిజాము సైన్యము ఇంగ్లీషు ఉద్యోగుల సహాయముతో సంస్కరింపబడెను. సికిందరుజాహ పరిపాలన కడపటి భాగమున పాడయ్యెను. రాజ్యములో వివిధ ప్రాంతములందు శిస్తు వసూలు హక్కులు గుత్తకియ్యబడి ఆ గుత్తేదారులు కావించు ప్రజాపీడనము మితిమీరెను. ప్రభుత్వము ఋణగ్రస్తమయ్యెను. ఇంగ్లీషు వారికి బాకీపడెను. దేశములో కల్లోలము కలిగెను. దారి దోపిడిదొంగలు విజృంభించిరి. ఇంగ్లీషు సైన్యములీ కల్లోలము నడచవలసి వచ్చెను. అంతట నిజాము
సర్కారువారి కోరికపై జిల్లాలను వేరువేరుగా పరిపాలించుటకు ఇంగ్లీషు కలెక్టర్లు నియమింపబడిరి. ఈ సమయముననే
కంపెనీవారు నిజాముకు 11,66,666 రూపాయలిచ్చి ఉత్తర సర్కారులకు సర్వాధికారు లైరి.
సికిందరుజాహ 1829 లో చనిపోయెను. నాజరుద్దౌలా నిజామయ్యెను. అతడు ఇంగ్లీషు కలెక్టర్లను తీసివేయమని కోరెను. మరల దుష్పరిపాలనము, ప్రజాపీడనము ప్రారంభమయ్యెను, అశాంతి హెచ్చెను. దౌర్జన్యములు చెలరేగెను . చందులాలు 1843లో తన పదవికి రాజీనామా నిచ్చెను. నిజాము నియమించిన మంత్రులు అసమర్థులైరి. నిజాము సైనిక వ్యయముక్రింద చాలా సొమ్ము బాకీపడి 1853 లో హైదరాబాదులోని రాయచూరు మొదలయిన కొన్ని జిల్లాలను కంపెనీవారి వశము చేసెను.
ఆకాలమున నిజాము కొలువులోనుండిన అరబ్బులు రోహిలాలు ఆయుధజీవులై కంటబడిన వారిపై నెల్ల దౌర్జన్యములు చేయుచుండిరి. వారు చేయు నేరములను వారినాయకులే విచారించవలెనుగాని సామాన్యన్యాయ స్థానములు విచారింప వీలులేదు. అందువలన వారుచేయు అక్రమములకు మితిలేకుండెను.
నాజరుద్దౌలా క్రీ. శ. 1857 లో చనిపోగా అఫ్ జుల్ ఉద్దౌలా (క్రీ. శ. 1857-69) నిజామయ్యెను. పూర్వపు మంత్రియైన సురాజ్ ఉల్ ముల్కుకు దగ్గర బందుగుడైన సాలారుజంగు ప్రధానమంత్రి యయ్యెను. ఇతడు చాల తెలివైనవాడు. దేశవ్యవహారములను చాల సమర్థతతో నిర్వహించుటయేగాక ఇంగ్లీషు ప్రభుత్వము వారికి నమ్మిన బంటుగానుండి పేరుపొందినాడు.
ఆంధ్రదేశ ఆర్థిక పరిస్థితులు : భారత దేశమునకు ఇంగ్లీషువారు వర్తకము చేసికొనుటకు వచ్చునప్పటికి ఈ దేశములో చాల సున్నితములైన రవ సెల్లాలు, జిలుగు వలువలు తయారగుచుండెను. మన పనివాండ్రు చాల నాజూకయిన వస్తువులను తయారుచేయుచుండిరి. పాశ్చాత్యూల కీ వస్తువులన్న చాల ప్రీతి. అందువలన వారు కోట్లకొలది విలువగల బంగారు తెచ్చి మనదేశములోని వస్తువులు కొని ఎగుమతి చేయసాగిరి. ఆ కాలమున మన దేశములోని సన్ననినూలురవ సెల్లాలు జగత్ప్రసిద్ధములై యుండెను. తెలంగాణమునందలి నాందేడులోను, తూర్పు కోస్తాయందలి పొందూరు మొదలగు ప్రాంతములలోను అట్టి సన్ననిబట్టయే తయారగుచుండెను. నిజాము రాజ్యములోని వరంగల్లు, నారాయణపేట మొదలగుచోట్ల టస్సరు పట్టుబట్టలును, హైదరాబాదు, గద్వాలలో నూలు, పట్టు కలిపిన మష్రూ అను అపూర్వపు నేతబట్టలును తయారగుచుండెను. తెలంగాణమున చాలచోట్లకరిగించిన ఇనుముతోను, ఉక్కుతోను అనేక వస్తువులు చేయుచుండిరి. నిర్మల, హైదరాబాదు, గద్వాల, వనపర్తి మున్నగు చోట్ల కత్తులును, తుపాకులును చేయుచుండిరి. మచిలీ బందరులో కాలికో అను బట్టలను, తూర్పుకోస్తాలో రకరకముల నూలుబట్టలను తయారుచేసి ఎగుమతి చేయు చుండిరి. ఔరంగాబాదు, వరంగల్లులలో జంపకానాలు, ఉన్ని, పట్టు తివాచీలు నేయుచుండిరి. ఇంగ్లీషువారు మన నవాబులను, రాజులను ఆశ్రయించి కొంత పలుకుబడిని సంపాదించుకొని మన పారిశ్రామికులు తమకు చౌకగా సరకుల నమ్మునట్లు నిర్బంధించుచుండిరి. ఇట్టి స్థితిలో, ఇంగ్లీషువారికి మన దేశములో రాజ్యాధికారము కలుగు సమయమునకు వారిదేశములో యంత్ర పరిశ్రమ స్థాపింపబడి, యంత్రములపైని సరకులు తయారుచేయబడుచుండెను. అంతట మనదేశమునుండి అనేక విధములుగా తీసికొని వెళ్ళిన సొమ్ముతో యంత్ర పరిశ్రమల నభివృద్ధిచేసికొని మనదేశములోని సరకులకు పోటీగా యంత్రములమీద తయారయిన సరకులను చౌకగా అమ్మి మన పరిశ్రమలను నాశనముచేసిరి. క్రీ. శ. 1825 నాటికి మనదేశములో రవసెల్లాలను ఎగుమతిచేయు వ్యాపారము పూర్తిగా ఆగిపోయినది.