ఆంధ్రదేశ చరిత్రము.. II
లలో సహాయ మొనర్చి, ముఖ్యముగా యాదవులతో పోరాడి తుదకు ప్రాణముల నర్పించెను. ఈతని తమ్ముని కొడుకు రుద్రసేనాని అనేక రణరంగములందు గెల్చి కాకతీయ రాజ్య విస్తరణకు కారకుడయ్యెను. కరీంనగర శాసనమునుబట్టి గంగాధరుడను బ్రాహ్మణ మంత్రి రాజ్యపాలనయందు సమర్థుడై అనేక దేవాలయములను కట్టించి సర్వ కళలను పోషించెను. ద్రాక్షారామ శాసనమునుబట్టి కాకతి రుద్రునికి 'విద్యావిభూపణ' బిరుదముండెను. ఈతడు రచించిన నీతిసారమును బద్దెన కవి నీతిశాస్త్ర ముక్తావళియను పేర తెనిగించెను. మల్లికార్జున పండితుడును, అతని శిష్యుడు పాల్కురికి సోమనాథుడును ఈ రాజపోషణమును పొందిరి. పల్నాటి యుద్ధానంతరము (1176-1182) వెలనాటి చోడరాజులు ప్రభ తగ్గెను. 1186 లొ కాకతి రుద్రుడు వెలనాటి గొంకరాజు నోడించి వారి రాజ్యమును నాశన మొనర్చెను.
పల్నాటి యుద్ధానంతరము నతవాటి, హైహయ వంశపు రాజుల సహాయమున కాకతీయ సామ్రాజ్యము తూర్పుతీరము వరకు వ్యాపించెను. ఏక శిలానగరము లేక ఓరుగల్లు రుద్రదేవుని కాలమున నిర్మింపబడెను. రుద్రేశ్వరాలయము మొదలగు అనేకాలయములు కట్టబడెను. చిత్రకళలు, ముఖ్యముగా శిల్పకళలు దేవాలయములందు వృద్ధిచెందెను. మంటప స్తంభములమీద శాసనములు, బొమ్మలు చెక్కబడెను. యాదవుల రాజగు జైతుగి ఆంధ్రరాజగు రుద్రునిపై దండెత్తి అతనిని చంపెను. అందుచేత రుద్రుని తమ్ముడు మహాదేవుడు రాజ్యమేలెను. ఈతని కాలమున జైతుగి తిరిగి దండెత్తివచ్చి మహాదేవుని జంపి అతని కుమారుని గణపతిని ఖైదీగా తీసికొని పోయెను, ఈతడు దేవగిరిలో 1209 వరకు ఖైదీగా నుండి ఆసంవత్సరము జైతుగి దయవల్ల విడువబడెను. ఈతడు ఖైదులోనున్న కాలమున సామంత రాజులు స్వతంత్రులైరి. కాని రేచర్ల రుద్రసేనాని, బొప్పదేవ సేనాని మున్నగువారు శత్రువులు నణచివేసిరి. 1212-1225 మధ్య గణపతి దేవుని వెలనాటి జయములు పూర్తి యయ్యెను. కోట, నతవాటివంశములతో సంబంధములను జేసెను. జాయపనాయకు నోడించి ఆతనిని తన గజ సైన్యాధ్యకునిగా నియమించెను. ఆతని సోదరీ ద్వయమును వివాహమాడెను. కొలనిమండలమును జయించి సోమయమంత్రికి ఆదేశమునిచ్చెను. ఆ తరువాత వారి సహాయమున కళింగమును జయించెను. కొలని సోమయ మంత్రి కోడులనాడు జయించి గోదావరి దాటి, మన్య ప్రాంతములను జయించి కళింగములోని దక్షిణ భాగములను జయించెను (1235-53). గుంటూరు, నెల్లూరు, కడప జిల్లాలలో పరిపాలించు తెలుగు చోళరాజులను 1245 - 50 మధ్య జయించెను. ఇదేసమయమున దక్షిణదేశమున చోళరాజులు పాండ్యులచేతను, పల్లవులచేతను ముట్టడింపబడుట చూచి గణపతి తన సేనానియగు సామంతభోజుని గొప్ప సైన్యముతో పంపి కంచి మొదలుగాగల దక్షిణ దేశములను జయించెను.
ఈతని తరువాత ఈతని పుత్రిక రుద్రాంబ 1258 నుండి 1296 వరకు రాజ్యమేలేను. ఈమె చాళుక్య వీరభద్రుని భార్య. ఈమె కూతురు ముమ్మక్క. ఆమె కుమారుడు ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి రాజ్యమునకు వచ్చిన వెంటనే దక్షిణ దిశనుండి చోళులు, తెలుగు చోళులు, పల్లవులు దండెత్తిరి. కాని ఆమె సేనాని త్రిపురాంతకుడు వారినందరిని పారదోలెను. ఇక ఉత్తరము నుండి యాదవులు దండెత్తిరి. దేవగిరి రాజు మహాదేవుడు దండెత్తి కొంతకప్పము గైకొని పోయెను. ఈమె ఓరుగల్లున రాతిగోడను కోటలోపల కట్టించి దానికి మెట్లు కట్టించెను. పెక్కు అగ్రహారములను భూదానములను ఇచ్చెను. ఈమె తరువాత ఈమె దత్తుడు, మనుమడు ప్రతాపరుద్రుడు 1290 నుండి 1326 వరకు రాజ్యమేలెను. ఈతడు 1254 లో జన్మించుటచేత రాజ్యమునకు వచ్చుసరికి 36 సం.ల వయస్సుకలిగియుండెను. 1290 నుండి 1296 వరకు రుద్రాంబకు రాజ్యపాలనమున సహాయముచేసెను. తాను స్వయముగా రాజైన తరువాత నెల్లూరు చోళులను జయించెను. వారినుండి కప్పమును గైకొనెను. ఈతడు రాజ్యమునకు వచ్చిన సంవత్సరమున అల్లా యుద్దీను ఖిల్జీ ఢిల్లీ చక్రవర్తి అయ్యెను. 1294 లో అల్లాయుద్దీను' దేవగిరి యాదవుల నోడించి కప్పము గైకొనెను. 1303లో తిరిగి దండెత్తి కాకతీయులచే ఓడింపబడి పరారయ్యెను. గండికోట ప్రాంతముల నేలు కాయస్థులు తిరుగుబాటు చేయగా వారిని ఓడించెను.