Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము. II


తన రెండవ కుమారుడు ముమ్మడి చోళ రాజరాజు (1076-78), ఆతని తర్వాత మూడవ కుమారుడు వీర చోళ (1078-84), తరువాత పెద్దకుమారుడు రాజరాజ చోడగంగు (1085-89). ఆ తర్వాత తిరిగి వీరచోడ (1089-92), ఆతరువాత విక్రమచోళ (1093-1118) రాజ ప్రతినిధులుగా వరుసగా పాలింపజేసెను. 1118 లో కులోత్తుంగుడు తన రాజధానికి విక్రమచోళుని పిలువ నంపెను. వేంగి అరాజక మయ్యెను. 1119 లో కులోత్తుంగుడు చనిపోగా విక్రమచోళుడు ద్రామిళ, వేంగి దేశములకు చక్రవర్తి యయ్యెను. కాని వేంగి పై ఆరవ విక్రమాదిత్యుడు దండెత్తి దానిని స్వాధీన పరచుకొని 1126 వరకు మాత్రమే పాలించెను. అప్పటినుండి తిరిగి వేంగి విక్రమచోళుని స్వాధీనములోనికి వచ్చెను. ఇతడు వెల నాటి చోడులను తన రాజప్రతినిధులుగా నియమించెను.

ఈకాలమున తెలుగు దేశమును వేరువేరు వంశములు పాలించెను. ఎలమంచిలి, పిష్ఠపురము, కోనమండలము, వెలనాడు, పాకనాడు, పొత్తపినాడు మొదలగు దేశ విభాగములు వేర్వేరు వంశములక్రింద పాలింపబడు చుండెను. వీరిలోకెల్ల తెలుగు చోళులు, లేక పొత్తపి చోళులు ప్రసిద్ధులు, కడపజిల్లాలోని కొంతభాగమును, చిత్తూరు జిల్లాలోని కొంత భాగమును కలిసి పొత్తపినాడన బడెను. ఈ తెలుగు చోళులు ప్రథమమున తూర్పు చాళుక్య వంశములోనివారే కర్నూలు జిల్లాలోని పెడకల్లు రాజధానిగా జటాచోడుని కొడుకు భీముడు పాలించెను. కైలాసనాథాలయ శాసనమునుబట్టి ఈ తెలుగు చోళులు చోళత్రినేత్ర, కరికాల రాజుల సంతతియనియు, జటాచోడ భీముడు గొప్ప రాజనియు అతడు గణక విజయా దిత్యుడు, చాళుక్య భీముడు, కొల్లభిగండ విజయా దిత్యుడు, ఆతని కూతురు సంతతివాడనియు, ఆతని చెల్లెలు అమ్మరాజు భార్య అనియు, అతనిని చంపి, దానార్ణవుడు రాజ్యమునకు వచ్చుటచేత అతనిని జయించి వధించి పొత్తపినాడులో స్వతంత్రుడయ్యె ననియు తెలియును (972). వైదుంబులను ఓడించియు, రాష్ట్ర కూటులను తిరస్కరించియు తన రాజ్యమును విస్తరింప జేసెను. ఈ వంశమువారు వేరువేరు శాఖలై కొణిదెన, పొత్తపి, నెల్లూరు, ఏరువ, కందూరు, హేమవతి మొదలగు ప్రదేశములలో చిన్న చిన్న రాజ్యముల నేర్పరచుకొని 16 వ శతాబ్ది మధ్య భాగమువరకు ఆంధ్ర దేశములో పరిపాలించిరి. వీరి శాసనములు కంచిలో దొరుకుట చేత కొంత కాలము దాని నాక్రమించిరని తెలియును. 14 వ శతాబ్దమున వీరు కాకతీయులకు కప్పము కట్టుచు వారి క్రింద సామంత రాజులుగా పరిపాలించుచుండిరి.

వీరిలో ఒకశాఖ 1050 - 1300 మధ్య గుటూరు జిల్లాలోని కమ్మనాడు నేలిరి. కొణిదెన రాజధాని. బల్లీశ్వర, కామీశ్వర, త్రిభువన మల్లీశ్వర ఆలయములు ముగ్గురు రాజుల పేర వెలయించిరి. వీరు ప్రధమమున వేంగి చాళుక్యులకును, తరువాత పశ్చిమ చాళుక్యులకును, తరువాత కాకతీయులకును సామంత రాజులుగా నుండిరి. వీరు సూర్యవంశపు క్షత్రియులుగా వర్ణింపబడిరి. వీర నేక దాన శాసనములను ఇచ్చిరి. బల్లి యచోళుడు 10 వ శతాబ్ది మధ్యభాగమున పరిపాలించెను. ఈతని కాలమున రేనాడు (కడప) దేశమును వదిలి తూర్పుగా గుంటూరు, నెల్లూరు జిల్లాలకు వచ్చి చేరిరి.

చోడబల్లి కుమారుడు నన్ని చోడుడు (1050 - 1100) కుమార సంభవ గ్రంథకర్త. ఈతడు నన్నయకాలము వాడు. ఈతని గ్రంథమున పేర్కొనబడిన చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుడని తోచును. ఈతడు పాక నా డేలెను. పొత్తపి రాజధాని. ఈ తరువాత కామదేవుడు (1100 - 1115) పాలించెను. ఈతని శాసనములు త్రిపురాంతకమున కలవు. మంత్రి భీమయ, ఈతడు కులోత్తుంగ చోళమహారాజునకు సామంతుడు. ఈతని తరువాత ఈతని కుమారుడు కన్నారచోడుడు 1115-1133 మధ్య పాలించెను. ఈత డనేక దానశాసనముల నిచ్చెను. గుద్దవాడి నాడు (రామచంద్రపురం తాలూకా) లోని పెద్ద డాక రేమి (ద్రాక్షారామము) భీమేశ్వరునికి తన తల్లిదండ్రుల పుణ్యము నిమి త్తము అనేక ధర్మములను జేసెను. ఇట్లే కాళహస్తీశ్వరునికి కమ్మనాడులోని దేవాలయములకు అనేక ధర్మములు చేసెను. కులోత్తుంగ, విక్రమచోళులకు సామంతుడు. వారి బిరుదములు వహించెను. క్రమముగా దక్షిణమునకు తన రాజ్యమును విస్తరింప జేసెను. ఈతని కాలమున రెండవ ప్రోలరాజు కాకతీయరాజ్యమును తూర్పునకు సాగించుచుండెను,