Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/515

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము - I


యానశాఖకు ప్రవక్తకు డాయెను. ఈతడు భక్తితత్వమునుగూడ ప్రతిపాదించెను. ఈతడు శ్రీపర్వతము పైననే క్రీ. శ. 194 సం. లో సిద్ధి పొందెను. ఆతరువాత ఆసంవత్సరముననే నాగార్జునుని మన్ననచేసిన యజ్ఞశ్రీ శాతకర్ణి కూడ మరణించెను. మరణానంతరము నాగార్జునుడు బోధిసత్త్వుడుగా కీర్తింపబడెను.

క్రీ. శ. 7వ శతాబ్దమున 84 మంది సిద్ధులలో నొకడగు మరియొక నాగార్జునుడు రసాయన శాస్త్రజ్ఞుడు ఉండెనని తెలియుచున్నది. ఇతనిచే వ్రాయబడినట్లు తలపబడు రసరత్నాకరము అను రసాయనశాస్త్ర గ్రంథములో శాతవాహన రాజుతోడి సంభాషణము కనిపించు చుండుటచే దానిని బోధిసత్వ నాగార్జునుడే రచించి యుండునని కొందరందురు.

వివిధ రాజవంశములు  : శాతవాహన రాజ్యము చీలిపోయిన తరువాత ఆ స్థానమున అనేక రాజవంశములు వెలసినవి. పశ్చిమమున (మహారాష్ట్రమున) అభిరులను వారు పరిపాలించిరి. ఈశ్వర సేను డను రాజు ఈ రాజ్యమును స్థాపించేను, ఈశ్వరదత్తుడు, వీరసేనుడు అను రాజులుకూడ పాలించిరి. ఆభీరులు 67 సం. లు పాలించినట్లు పురాణములు చెప్పుచున్నవి.

చుటు వంశపు రాజులు  : శాతవాహన సామ్రాజ్యపు నైరృతి ప్రాంతము (కర్ణాటకము) చుటు వంశపువారిచే పాలింపబడెను. వీరి రాజధాని 'వనవాసి' లేక 'వైజయంతి'. హారీతీపుత్ర విష్ణుస్కంద చుటుకులానంద శాతకర్ణి, హారీతీపుత్ర శివస్కంద వర్మలు ఈ వంశములో ముఖ్యులు. వివాహసంబంధమువలన కదంబులకును, పల్లవ వంశీయుడగు వీర కూర్చుడు బంధువగుట చేత పల్లవులకును మధ్య ఈరాజ్యము కొరకు తగువు లేర్పడెను. చుటు రాజ్యముపల్లవుల వశమైనది. చుటు వంశపురాజులు శాతవాహన రాజులవలె శాతకర్ణి బిరుదును తాల్చి వారి వలెనే పాలించిరి.

ఇక్ష్వాకులు (క్రీ. శ. 220-260): ఆంధ్రదేశమును శాతవాహనుల తరువాత పాలించిన వంశములలో ఇక్ష్వాకు రాజవంశము ముఖ్యమైనది. వీరు కృష్ణానదీ తీరమునందలి విజయపురి రాజధానిగా మూడవ శతాబ్ది నడుమ 52 సంవత్సరములు పరిపాలించిరి. ఈ వంశములో నలుగురు రాజుల పేర్లు తెలియవచ్చినవి. నాగార్జున కొండ,జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి ప్రాంతములలో లభించిన శాసనముల మూలమున ఈ వంశీయులను గూర్చి తెలియుచున్నది. నాగార్జున కొండను శ్రీపర్వతమనుట కలదు. వీరు పురాణములలోని ఇక్ష్వాకు వంశమునకు చెందిన వారనియు, దక్షిణ ప్రాంతము నకు వచ్చి స్థిరనివాస మేర్పరచుకొని రనియు, శాతవాహనులకు సామంతులై తత్సామ్రాజ్య పతనానంతరము స్వతంత్రులై రనియు చరిత్రకారుల అభిప్రాయము. నాగార్జునకొండ శిథిలములు బయల్పడిన తరువాత నాగార్జునకొండ ప్రక్కనే విజయపురి కలదని ఋజువైనది. అల్లూరు శాసనము ప్రకారము ఇక్ష్వాకులు శాతవాహనుల పాలనలో మహా తలవరులుగా నుండిరి. శాతవాహనుల పతనసమయమున వీరు స్వతంత్రులై నట్లు తెలియుచున్నది.

ఇక్ష్వాకు రాజవంశమునకు మూలపురుషుడు వాసిష్ఠీ పుత్ర శ్రీశాంతమూలుడు. (క్రీ. శ. 220-230). ఈ మహారాజు గొప్ప పరాక్రమవంతుడు. యజ్ఞ యాగాదులు చేసినవాడు. కోట్లకొలది బంగారు నాణెములను, గోశత సహస్రములను దానము చేసినవాడు. ఇతడు వేలకొలది నాగళ్ళతో భూమిని సాగుబడిలోనికి తెచ్చెను. ఇతడు వైదిక మతాభిమాని. అయినను రాజవంశపు స్త్రీలు బౌద్ధ మతాభిమానము కలిగియుండిరి. ఇతని ఇద్దరి రాణులలో నొకామె మాఠరీదేవి. సోదరీ మణులగు హమ్మసిరినిక, శాంతిశ్రీలు బౌద్ధ భిదువులకు దానము చేసిరి. వారి ప్రోత్సాహముననే విజయపురిలో పెక్కు బౌద్ధ చైత్యనములును, విహారములును వెలిసినవి.

శ్రీశాంతమూలుని కుమారుడు మాఠరీపుత్ర శ్రీ వీర పురుషదత్తుడు (క్రీ. శ. 230-250). తండ్రివలె ప్రతిభావంతుడు కాడు. ఐనను ఈతని కాలమున బౌద్ధమతమునకు విశేష ప్రాముఖ్యము కలిగినది. రాజవంశపు స్త్రీలు చెక్కించిన శాసనములు నాగార్జున కొండపై కాన వచ్చును. మహారాజు భార్యలు, మేనత్తలు మాత్రమేకాక సామాన్యస్త్రీలు సయితము బౌద్ధఖితువు లకు దానములు చేసి బౌద్ధ విహార నిర్మాణమునకు తోడ్పడిరి. బోధిశ్రీ యను నామె రేవతుడను ధనవంతుని కుమార్తె. రెండు చైత్యగృహములను, ఒక విహారమును ఆమె కట్టించెను.