ఆంధ్రదేశ చరిత్రము - I
డనియు నందురు. భట్టిప్రోలు స్తూపశాసనమువలన రాజా కుబ్బీరకుడను నొక రాజు తెలియవచ్చుచున్నాడు. ఈశాసన
లిపి అశోకుని శాసనలిపిని పోలియుండుటచే కుబ్బీరకుడు ప్రాచీనుడని తెలియవచ్చుచున్నది.
ఆంధ్ర శాతవాహనులు : ఆంధ్ర శాతవాహనుల చరిత్ర తెలియుటకు అనేక సాధనములు కలవు. వీనిలో వాయు, మత్స్య, బ్రహ్మాండ పురాణములు, రాజుల శిలాశాసనములు, నాణెములు, ఆ రాజుల కాలమున రచింపబడిన ప్రాకృత సంస్కృత గ్రంథములు, అప్పటి శిల్ప నిర్మాణములు, అమరావతీ స్తూపములు, నాగార్జునకొండ స్తూపములు, నాసిక, కన్హేరి, కార్లీ గుహాలయములు, విదేశీయుల వ్రాతలు. ఇతర గాథలు ముఖ్యముగా పేర్కొనిదగియున్నవి.
సుమారు నాలుగున్నర శతాబ్దములు పాలించిన ఆంధ్ర శాతవాహనులు, పురాణములలో ఆంధ్రరాజు లనియు, శాసనములలో శాతవాహను లనియు పేర్కొనబడి యున్నారు. ఈ రెండు ఆధారములలో కన్పడు రాజుల పేర్లును సరిపోవుటచేత రెండును ఒకేవంశమునకు చెందిన రాజులకథ అని భావింపబడుచున్నది. శాతవాహన అనునది రాజవంశము పేరు, ఆంధ్ర అనునది జాతి పేరు. వీరినే ఆంధ్రభృత్యులని కూడ వ్యవహరించిరి. శాతవాహనుల జన్మస్థానమును గూర్చి వివాదములు కలవు. కృష్ణా, గోదావరీ నదుల మధ్యభాగమున తూర్పు సముద్ర తీరమునుండి వీరు క్రమముగా పశ్చిమముగా నాసికవరకు జయించి, దక్షిణాపథ చక్రవర్తులు అను పేరు వహించిరని ఒక అభిప్రాయము కలదు. అట్లుకాక మొదట మహారాష్ట్ర ప్రాంతమును పాలించి క్రమముగా కృష్ణా గోదావరుల నడిమి ప్రదేశమును స్వాధీన పరచుకొని పశ్చిమభాగమున తమ ఆధిక్యము తగ్గగానే తూర్పు ప్రాంతమునే పాలించి ఆంధ్రదేశము అను నామము వారు దీని కొసగియుందురని మరియొక వాదము, అటులయిన పైఠను లేక ప్రతిష్ఠాన పురము వారి రాజధాని యగును. శాతవాహన రాజుల శాసనములు విస్తారముగా మహారాష్ట్రములోనే దొరకుటయు, తూర్పుసీమలో తక్కువగా కానవచ్చుటయు ఈ ఊహకు మూలములు. కాని బళ్లారిజిల్లాలో ఒక భాగమునకు 'సాతవాహన హారము' అని పేరున్నట్లు మ్యా కదొని శాసనము వలన తెలియుచున్నది. అందుచేత శాతవాహనుల జన్మస్థానము ఆ ప్రాంతమనియు, అచ్చటి నుండి తూర్పునకు వీరు విజృంభించిరనియు మరియొక మతము.
అశోకుని శాసనములలో రఠికులు, భోజకులు, పిటినికులు, ఆంధ్రులు, పుళిందులు మున్నగువారు అతని సామ్రాజ్య ప్రజలలో చేరియున్నట్లు వర్ణింపబడి యున్నది. వీరిలో రఠికులు మహారాష్ట్ర నివాసులనియు భోజకులు విదర్భ వాసులనియు, పిటినికులు పైఠన్ ప్రాంతీయులనియు, పుళిందులు వింధ్యాద్రి గతులనియు పండితులు చెప్పుచున్నారు. ఇక మిగిలినవారు ఆంధ్రులు. వీరు దక్షిణాపథము యొక్క ప్రాక్తీరవాసులని అంగీకరించుట సులభము. లేనిచో వీరి జన్మస్థానమైన ప్రదేశమును నిరూపించుటకే వీలుండదు. ఆంధ్రులకు ఉత్తరమున కళింగ దేశము వ్యాప్తమై యుండెను. శాతవాహనులు ఆంధ్రులలో నొక శాఖవారై దక్షిణాపథము యొక్క ప్రాక్తీరమున మొదటినుండియు నివసించి రాజ్య నిర్మాణము చేసి మౌర్యుల యనంతరము పశ్చిమముగా విజృంభించి విదర్భను మహారాష్ట్రమును జయించిరనుట విశ్వసనీయముగా తోచుచున్నది. శాతవాహన రాజుల చివరికాలములో తూర్పుదేశము పైననే వారి కాధిపత్యము ఉండెననుట స్పష్టము. అమరావతి ధాన్యకటకము, పైఠను ఆ కాలమున ప్రసిద్ధి కెక్కిన రాజనగరములు.
పురాణముల ప్రకారము ఈ వంశమునకు చెందిన 30 మంది రాజులు పాలకులై యున్నట్లు విదితమగు చున్నది. వీరిలో మొదటివాడు శ్రీముఖ శాతవాహనుడు. ఈతడు క్రీ. పూ. 225 లో స్వతంత్రుడై యుండెను. అమరావతి ఇతని రాజధాని. 23 సం. ల పరిపాలన అయిన తరువాత అతని సోదరుడు కృష్ణుడు రాజయి సాతవాహన రాజ్యమును నాసికవరకు విస్తరింప జేసెను. ఇతని కాలములో నాసికలో శ్రమణుల కొక గుహ తొలిపించబడెను. చైత్యమొకటి కట్టించబడెను. కృష్ణశాతవాహనుడు 18 సం.ల కాలము పాలించెను. తరువాత శ్రీముఖుని కుమారుడు మొదటి శాతకర్ణి చక్రవర్తి యయ్యెను. ఈయన భార్య నాయనికాదేవి. ఈమె మహా