Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలంకారశాస్త్ర చరిత్ర


ర్థమును, వ్యంగ్యార్థమును ప్రతిపాదించును అని అతడు నుడివెను.

ఔచిత్యవాదము  : ఒక్కొక్క కాలమున ఒక్కొక్క ఆలంకారికుని రుచిభేదము నుబట్టి ఒక్కొక్క కావ్యాంగమునకు ప్రాముఖ్యము లభించుచు వచ్చెను. కాశ్మీరదేశీయుడును, అవంతివర్మయొక్క ఆస్థాన విద్వాంసుడునగు క్షేమేంద్రుడు (క్రీ. శ. 1010-1020) ఔచిత్యము అను నొక సిద్ధాంతమును లేవదీసెను. క్షేమేంద్రుడు సుమారు నలువది గ్రంథములను రచించెను. వాటిలో ఔచిత్యవిచారచర్చ, కవికంఠాభరణము అనునవి అలంకార శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములు.

క్షేమేంద్రుని 'ఔచిత్యవిచార చర్చ' మృదుమధుర భాషా నిబద్ధము. సహృదయ రంజకము. అందు అతడు ఔచిత్యమును గూర్చి ఇట్లు విచారణచేసెను. జౌచిత్యము రసమునకు జీవితభూతము. చమత్కార కారి. అది రస ప్రసిద్ధమైన కావ్యమునకు స్థిరమైన జీవితము. (ఔచిత్యం రససిద్ధస్యస్థిరం కావ్యస్య జీవితం) కావ్యమునందు జీవితభూత మైన ఔచిత్యము లేకున్నచో, బాహ్య శోభాకరములయిన అలంకారములుగాని, గుణములుగాని ప్రయోజనకారులు కాజాలవు. కాబట్టి రసవంతమగు కావ్యమునకు ఔచిత్యమే జీవితభూత మగుచున్నది.

ఔచిత్యమును క్షేమేంద్రు డిట్లు నిర్వచించెను. ఏది దేనికి తగునో అది ఉచితము. ఉచితము యొక్క భావమే ఔచిత్యము.

(ఉచితం ప్రాహు రాచార్యాః సదృశంకిల యస్యయత్,
ఉచితస్యహి యోభావః తదౌచిత్యం ప్రచక్షతే॥)

లోకమునందు శరీరాలంకారములు ఉచితస్థానములందు విన్యస్తములై ఔచిత్యమును పోషించును. గుణములు ఔచిత్య యుక్తములైనప్పుడే గుణము లగును, కంఠము నందు మేఖలను, నితంబఫలకమునందు హారమును, పాణి యందు నూపురమును, చరణమునందు కేయూరమును ధరించుట, ప్రణతుడైన శత్రువునందు శౌర్యమును చూపుట మున్నగు కృత్యములు, హాస్యమునకు హేతువు లగుచున్నవి. అట్లే అలంకారములు, గుణములు, ఔచిత్య రహితములైనచో రుచికరములు కాజాలవు అని అతడు చెప్పెను.

క్షేమేంద్రుడు అనౌచిత్యమును పద, వాక్య, ప్రబంధార్థ, గుణ, అలంకార, రస, క్రియా, కారక, లింగ, వచన, విశేషణ, ఉపసర్గ, నిపాత, దేశ, కాల, నామాది భేదములచే విభజించెను. విభజించుటయే గాక, ఆ పద వాక్యాది - ఔచిత్యములను నిర్వచించి, వాటినన్నిటిని సోదాహరణముగ వివరించెను. కాళిదాసాది మహాకవుల గ్రంథములలోని అనౌచిత్యదోషములను నిర్దాక్షిణ్యముగా విమర్శించెను.

క్షేమేంద్రుడు తన ఔచిత్య విచార చర్యయందు పూర్వాలంకారికులకు ఋణపడి యున్నట్లు విదితమగు చున్నది. ఎట్లన దండి, కామం సర్వోప్యలం కారో రస మర్థే నిషించతి । తథా ప్యగ్రామ్యతై వైనం భారం వహతి భూయసా' (సర్వాలం కారములును నిస్సందేహముగా రస స్ఫోరకములే. ఐనను అగ్రామ్యతయే అనగా అనౌచిత్యా భావమే సర్వభారమును వహించును) అని నుడివెను. ఆనౌచిత్యాభావ మన ఔచిత్యస్థితియని అర్థము. ఔచిత్య స్థితిచే రసస్ఫురణ మేర్పడు ననుచో అనౌచిత్యము రసభంజకమని తేటపడుచున్నది. ఆనందవర్ధనుడు ఈ భావము నే,

'

అనౌచిత్యాదృతే నాన్య ద్రసభంగస్య కారణమ్ ।
ప్రసిద్దౌచిత్యబంధస్తు రసస్యోపనిష త్పరా॥

' (అనౌచిత్యము కంటె రసభంజకమైన హేతువు మరియొకటి లేదు. ఔచిత్య విశిష్టమయిన కావ్యము రసోపనిషత్తే) అని వచించెను. ఆనందవర్ధనుని ఈ కారికార్థమునే స్వీకరించి క్షేమేంద్రుడు 'ఔచిత్యం రససిద్ధస్య స్థిరం కావ్యస్య జీవితమ్' అను తనవాదమును ప్రతిష్ఠించెను. అందుచే క్షే మేంద్రుని ఔచిత్యవాదములో నుపజ్ఞ లేదనియు, దాని నాతడు పూర్వాలంకారికులనుండి గ్రహించి విపులీకరించి దానికొక ప్రత్యేకస్థాన మొసగెననియు విదితము కాగలదు.

వక్రోక్తి సిద్ధాంతము  :- వక్రోక్తియను శబ్దము సాహిత్యములో చాల ప్రాచీనకాలమునుండియు పెక్కు అర్ధములలో ప్రయోగింపబడుచు వచ్చెను. బాణుడు 'వక్రోక్తి నిపుణేన విలాసిజనేన' అని ప్రయోగించెను. దండి తన కావ్యాదర్శములో వక్రోక్తిని స్వభావోక్తికి వ్యతిరేకముగా వాడెను. శ్లేష వక్రోక్తికి పోషకమని యాతడు పల్కెను. వక్రోక్తియనగా ఉక్తి వైచిత్య్రము. అది తరచుగా శ్లేషపై ఆధారడియుండి, ఋజుభాషణము