Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలంకరణ కళ


వీటిని కలుపుటలో రెండుపద్ధతులు గమనింపదగి యున్నవి.

1. ఒక రేఖ మరొకదానిని కోయకూడదు. లేక ఒక రేఖ మరొక రేఖకు అసంగతముగా నుండక సుసంగతముగా నుండవలయును.

2. ఒకే జాతిరేఖను అనేకసార్లు అంచులో నుపయోగించునపుడు సమానాంతరముగా (parallel) ను సమదూరముగాను వేయవలెను. ఇవి సామాన్యసూత్రములు.

తోరణములు - Running Designs. ఈ మూల రేఖలలో ఒక దానిని మరొకదానిచే జోడించినచో భిన్న భిన్న రూపము లేర్పడును.

మూల రేఖలను కుదింపవచ్చును, సాగదీయవచ్చును.

దిగువ నుదాహరింపబడిన బంధయుక్తి ననుసరించి గీచినచో అనంతములయిన అలంకార ఖండములను సృష్టింప వీలగును.

ఆల్పన (ముగ్గులు): ఈ కళ నెరుగని ఆడుబిడ్డలు ఆంధ్రదేశములో లేరనవచ్చును. అక్షరము వ్రాయలేని ఆడువారికి అలంకరణము వెన్నతో బెట్టిన విద్య. మన దేశములో మూగ మగువలకుగూడ మ్రుగ్గులు వేయుట ఉగ్గుపాలతోనే నేర్పిన విద్య. ఈ కళ సర్వసాధారణమై నేటికిని జీవించియున్నది.

ఒక్క తరంగ రేఖను ఎన్ని విధాలుగా మలచవచ్చునో ఈ దిగువ నిరూపింపబడినది.

'లయ' (Rhythm) : అలంకరణ కళను దృశ్యసంగీత మనవచ్చును. సంగీతమునకువలె స్వరము, రాగము, తాళము అలంకరణ చిత్రమునకుకూడ ఆవశ్యకములు.రేఖ యొక్కయు, స్థలము (Space) యొక్కయు, క్రమ విభాగము వలన లయ ఏర్పడును. రేఖ యొక్క సమ గతియు, క్రమగతియు లయ యనబడును. ఇది సంగీతములో తాళమువంటిది.

స్థల విభాగము, (1) మంద, మధ్య, త్వరితగతి రేఖలచే ఇరుకుగాను, విశాలముగాను క్రిందివిధముగా చేయ వచ్చును. మొదట చుక్కలు సమదూరములో పెట్టి ఏదైన ఒక మూల రేఖచే కలిపినచో నీ క్రింది విధముగా నుండును.

పై తావున బిందువులు క్రకచరేఖలచే కలుపబడినవి. పై వానికి ఇతర మూల రేఖలచే క్రమపద్ధతిలో జోడించినచో అంచులోని అలంకరణము అధికతరమగును, రేఖా గతియందు మార్పుండియు సరిపోటీ క్రమముగానున్నది.