అరేబియా (చరిత్ర)
మహాపురుషులు అరబ్బులలో జన్మించిరి. కాని ఈ యుగమున అరబ్బులలో అనేక దురాచారములుకూడ వ్యాపించెను. సురాపానము, ద్యూతము, పసిబాలికలను సజీవముగ పాతి వేయుట, స్త్రీలకు సమాజములో అర్హ స్థానము లేకుండుట మున్నగు గొప్ప లోపములు వీరియందుం డెను. ఈ కాలమున యెమెన్, జీమన్, హెజాజ్, నెజ్ద్ ప్రాంతములలో కొన్ని చిన్న చిన్న స్వతంత్ర రాజ్యములు నెలకొని యుండెను. అందు కొన్ని కేవల నగర రాజ్యములు. మ్వానిలో హెజాజ్ నందలి మక్కా పట్టణము ముఖ్యమైనది. ఇది పవిత్రమగు యాత్రాస్థలముగను, వ్యాపార కేంద్రముగనుకూడ ఖ్యాతి వహించెను. ఇట్టి మక్కా నగరమున ప్రవక్తయగు మహమ్మదు జన్మించెను.
ప్రవక్తయగు మహమ్మదు నూతనమగు నొక మతమును స్థాపించుటయేకాక, అరేబియాయం దొక బలమగు ప్రభుత్వమును నెలకొల్పి, అరబ్బు ప్రజలను సంఘటిత పరచుటకై యత్నించెను. ఆయన మరణించుసరికి పశ్చిమ అరేబియా అంతయును, మక్కా మదీనా పట్టణములును ఆయన వశమయ్యెను. మహమ్మదు తరువాత రాజ్యమునకు వచ్చిన మొదటి ఖలీఫాయగు అబూబకర్ అరేబియా రాజ్యమునంతను జయించి, ప్రభుత్వమును బలపరచెను. క్రమక్రమముగా అరబ్బులు పశ్చిమమునకు వ్యాపించి, ఆఫ్రికా, ఐరోపాఖండములలో తమ సామ్రాజ్యమును విస్తృత పరచిరి. అనేక కారణములవలన అరబ్బు రాజ్యములో అంతఃకలహము లుప్పతిల్లెను. క్రీ.శ.660 వ సంవత్సరమున, డెమాస్కస్ నగరము అరబ్బు రాజ్యమునకు ముఖ్యస్థాన మయ్యెను. ఇచ్చటినుండి పరిపాలనము కావించిన ఒమయ్యదు ఖలీఫాలు అరేబియా సామ్రాజ్య సర్వస్వమునకును ఏలికలుగ నుండిరి. వారి యనంతర మధికారముపూనిన అబ్బాసీ ఖలీఫాలు తమ కేంద్రమును బగ్దాదు నగరమునకు మార్చిరి. అందువలన క్రమముగా అరేబియా ప్రజలకును, ఖలీఫాల రాజ్యమునకును సంబంధములు తెగిపోయెను. అరేబియాయందు కేంద్ర ప్రభుత్వము లేదయ్యెను. అంతఃకలహములు చెలరేగి, దేశమున చిన్న రాజ్యములు 'నెలకొనెను. మహమ్మదు ప్రవక్త వారసులగు షరీపు వంశీయులు, ఈ అంధకార యుగములో కొంత ప్రాముఖ్యమును సంపాదించిరి. కాని వారుకూడ ఈజిప్టు రాజులకును, ఆపైన కాస్ స్టాంటినోపిలునుండి గొప్ప సామ్రాజ్యమును పాలించిన తురుష్క చక్రవర్తులకును వశులైరి. ఇది మధ్యయుగవు చరిత్ర.
అరేబియా దేశము యొక్క ఆధునిక చరిత్రలో వహాబీ ఉద్యమము పేర్కొనదగినది. ఈ ఉద్యమమును ప్రారంభించిన యాతడు మహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్. ప్రవక్త మహమ్మదుచే బోధింపబడిన ఇస్లాము మతము నందు కాలక్రమమున ప్రవేశించిన లోపములను సంస్కరించి, సత్యమగు ఇస్లాము మతమును మరల నెలకొల్పవలెననియు, ఆనాడు అరేబియాలో వ్యాపించియున్న అంతఃక లహములను తుదముట్టించి, బలమైన యొక అరబ్బు రాజ్యమును స్థాపింపవల ముననియు, ఈ సంస్కర్త ఆశయములు. వహాబీ ఉద్యమము 18 వ శతాబ్దియందు ప్రారంభమై క్రమముగ బలపడెను. మొదటినుండియు సౌదీ వంశమువారు వహాబీ ఉద్యమమును బలపరచి, అరబ్బు జాతీయ రాష్ట్ర స్థాపనకై యత్నింప సాగిరి. ఈ ప్రయత్నములో తురుష్కులు వీరిని ప్రతిఘటించిరి. ఈ కథా కాలమునాటికి అరేబియా, తురుష్క సామ్రాజ్యములో నొక భాగముగ నుండుట గమనింపదగినది. అయినను వెనుదీయక వహాబీలు రియాఫ్ అనుచోట తమ ముఖ్యస్థానమును నెలకొల్పి, నూతన రాజ్య స్థాపనమునకై ప్రయత్నములు సాగించిరి. 1902 సంవత్సరము నాటికి అబ్దుల్ అజీజ్ ఇబ్న్ సౌద్ అనునాయకుడు వహాబీ ఉద్యమమునకు 'నేతయై దానిని బలపరచెను. ఇతడు క్రమముగ తన రాజ్యమును పెంపొందించుకొని, మొదటి ప్రపంచ యుద్ధమున ఆంగ్లేయుల పక్షము వహించి, తురుష్కులతో పోరాడి వారి నోడించెను. ఈ విధముగ ఇబ్న్ సౌద్ బలపడెను. ఈ రాజు మిక్కిలి రాజనీతి కుశలత గలవాడు. ఈతడు తన దేశములోని తిరుగుబాటు దారుల నణచివైచియు, బలవంతులగు నాంగ్లేయులతో స్నేహభావము పాటించియు, నేటిబలవత్తరమగు సౌదీఅరేబియా రాజ్యమును నెలకొల్పగల్గెను. ఈతడు ఎఱ్ఱ సముద్ర తీరమునను, పారసీక గుడ ప్రాంతమునందును గల నూనె గనులను అమెరికా కంపెనీలకు కౌలుకిచ్చి విశేషధనమును సేకరించెను. ఆ ధనమును వ్యయపరచి, అతడు తన రాజ్యమునందు గనులను త్రవ్వించియు, నీటి పారుదల