Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరిస్టాటిల్

ఎందరో భక్తులు ప్రతిదినమును వచ్చి సూర్యదర్శనము చేసికొని, తీర్థప్రసాదము లారగించిపోవుదురు. ఈ ప్రదేశమున మూడు చెరువులు గలవు. ప్రస్తుతము దేవాలయమునకు తూర్పుగా నొక పెద్ద కొలను గలదు. దీనిని సూర్య పుష్కరిణి యందురు. ఇందే స్నాన మాచరించి తైర్థికులు దేవదర్శన మొనరించెదరు. తైర్థికుల సౌకర్యము కొరకు ఉదారులు నిర్మించిన సత్రములు కలవు. ప్రత్యాది వారము పర్వదినము . మాఘమాసము సూర్యప్రీతి కరమయిన మాసము. రథసప్తమి సూర్యదేవుని పర్వదినములలో శ్రేష్ఠమైనది. దేవాలయమున నమక చమక సౌరత్రిచలతో సూర్య నమస్కారములు ప్రతిదినము జరుగును, ఇందు అర్చకులు సంప్రదాయబద్ధులు. అర్చనా విధానమున ఆరితేరినవారు, పరిశుద్ధులు నగుట ప్రశంసాపాత్రమైనది

అరసవెల్లిలోని సూర్యభగవానుని సందర్శించి హర్షము వెల్లువలు కాక యరిగిన వారు లేరు.

ది. రా.

అరిస్టాటిల్ (384 - 322 క్రీ. పూ.) (విద్యా విషయము):- జీవిత సంగ్రహము :- ప్రాచీన గ్రీకు విజ్ఞానమునకు మూలపురుషులు మువ్వురు. సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్. ఇదియొక అసాధారణ గురు శిష్య పరంపర. వీరిలో చివరివాడగు అరిస్టాటిల్ ప్రపంచ చరిత్ర యందు మొదటి మేటి శాస్త్రవేత్తయనియు, విజ్ఞానమును వ్యవస్థీకరించి శాస్త్రరూపము నిచ్చుటలో నద్వితీయు డనియు నెంచబడుచున్నాడు. ఈతని జీవితమునందు మూడు విస్పష్ట దశలు గమనింపదగును. ఈ దశలలో ఈతని మానసికాభివృద్ధియందుగూడ అంతరములు కనిపించును.

ప్రథమదశ  :- (క్రీ. పూ. 384 నుండి 847 వరకు) మేసిడోనియా సరిహద్దులపైనున్న ధ్రేసు రాష్ట్రము నందలి "స్టాజిరా" యను నూర క్రీ. పూ. 384 లో అరిస్టాటిల్ జన్మించెను. ఈతని తండ్రియగు "నికోమాకస్" మేసిడోనియారాజగు "అమిస్టాను”నకు ఆస్థాన వైద్యుడుగను, ఆప్తమిత్రుడుగను ఉండెను. ఈతని తల్లి పేరు "ఫేస్టిసు". బాల్యముననే తలిదండ్రులను కోల్పోయి నందున నీతనిని, బంధువగు "ప్రోక్సినన్" పెంచి పెద్ద

వానిని జేసి, విద్యాబుద్ధులు చెప్పించెను. 17వ యేట ఏథెన్సు నగరములో ప్లేటో యొక్క పాఠశాలను (ఎకాడమీ) ప్రవేశించి, 61 సంవత్సరముల వయస్సుగల గురువు పాదముల యొద్ద సకలవిద్యల నభ్యసించెను. తుదకాపాఠశాల యందే సహా యోపాధ్యాయుడయ్యెను. కళలు, శాస్త్రములు, రాజకీయ,త త్త్వశాస్త్రములు మతగ్రంథములు మొదలగు నవన్నియుపఠించెను. క్రీ.పూ 347 సం.న ప్లేటో కాలధర్మము నొందుటచే అరిస్టాటిల్ ఆ పాఠశాలను వీడెను.

ద్వితీయదశ  :- అటనుండి “జనోక్రేట్స్" అను ముఖ్య సహచరునితో గలిసి “ఏసస్" నగరమును జేరి, అందు పాఠశాల నొకదానిని నెలకొల్పెను. ఎకాడమీలో తన సహపాఠియగు "హెర్మియస్" యొక్క మేనకోడలు “పిథియస్" అను నామెను వివాహమాడెను.ఈతని సహాయమువలననే ఆరిస్టాటిల్ మేసిడోనియా రాజగు “ఫిలిప్” కుమారుడయిన “అలెగ్జాండరునకు పెల్లా నగర మందు దేశికుడయ్యెను. క్రీ. పూ. 335 వరకు ఈ పదవి నత్యంత సమర్థతతో నిర్వహించెను. ప్రపంచచరిత్రయందు ఇట్టిమహాప్రజ్ఞావంతులగు గురుశిష్యులు కానరారు. సహ పాఠియును, బంధువునకు హెర్మియస్ ను పర్షియనులు చంపిరను క్రోధమున నీతడు అలెగ్జాండరును తూర్పు దేశములపై దాడికై పురికొల్పెనని సందేహింపవచ్చును. క్రీ. పూ. 335 అలెగ్జాండరు సింహాసన మధిష్ఠింపగనే ఈతడు మరల ఏథెన్సు నగరమును చేరెను.

తృతీయదశ  :- ఇప్పటినుండి ఏథెన్సునందలి సామాన్య పాఠశాల యగు "లై సియం" నందు అరిస్టాటిలు ఉపా ధ్యాయుడయ్యెను. ఈ కాలమందీతడు ఉదయమున వ్యాయామము, ఉన్నత శాస్త్ర విషయములు మొదలగు