Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరబ్బీ భాషాసాహిత్యములు


యుగ ఆచారములు, ఆదర్శములు తిరిగి తలలెత్తి వ్యాపింపసాగెను. అంతకు ముందుండిన ధర్మతత్పరత్వము యొక్క స్థానమును స్వేచ్ఛావిలాస జీవితము _ ఆక్రమించెను. గ్రామీణ రాజకీయ పక్షములలో అంతర్యుద్ధములు పొడసూపెను. ఈ అంతర్యుద్ధములు బిడూయి౯ అరబ్బులకు పట్టణ జనులతో సంపర్కము కలిగించినవి. వీరిద్వారా బిడూయి౯ కవిత యొక్క ప్రాచీన రీతులు పట్టణములలో ప్రవేశించెను. ఈ కవిత సామాన్యముగా ఉద్రేశాత్మకము, ప్రకోపనాత్మకము అగుటచేత అచ్చట వర్ధమానమగుటకు దానికి అనుకూల వాతావరణము లభించెను. కాని, విమతస్థుల ఆక్షేప కావ్యములును (Satire=Hija), స్తోత్ర కావ్యములును (Eulogy =Fakhr) ఇప్పుడు రాజకీయ వాసనకలవియై రాజకీయ కవిత్వము, రాజకీయ ఆక్షేప కావ్యములు ప్రత్యక్షము కాజొచ్చెను.

విలాస జీవితవిధానము ప్రేమభావ పుష్టమై శృంగారాత్మక మైన, కావ్యములు ప్రభవించుటకు కారణమయ్యెను. విశుద్ధ ప్రేమాత్మక కావ్యములు ముఖ్యముగా ఎడారి జనపదములందు వర్థిల్లుచుండెను. నగరవాసుల ప్రేమ కవిత్వమునకు విరుద్ధమైన ప్రేమానుభవములను ఎడారికవి వర్ణించుచుండెను. బుఠానియా ప్రేమికుడగు జమిత్బుసూమరు “ (Jamit-b-Ma'mar. d. 82 A. H.), లు బ్నా ప్రియు డగు ఖైస్భుజారిహ్ (Qais-b-Jarih) ; లైలా వలపుకాడగు మజ్ను - వీరు పవిత్రప్రేమ కవిత్వము నందు నాయకులు. విమతస్థుల కాలములో 'గజల్' అను ఛందస్సు, ఓడ్ అను ఛందస్సునం దంతర్భాగముగ నుండెను. దానికి స్వతంత్ర అస్తిత్వము లేకుండెను. కాని ఉమ్మాయ్యీదుల కాలములో అది యొక స్వతంత్ర ఛందస్సుగా రూపొందెను.

ఇస్లాం మతము సాహితీ సంస్కృతులయొక్క అభివృద్ధిని పురికొల్పేను. అది క్రమముగా బలపడెను, అప్పుడు విద్వాంసులు ప్రాచీన కవితా గ్రంథముల సేకరణ ప్రయత్నమునకు పూనుకొనిరి. “రావిస్" (Rawis) అనువారు ప్రాచీన కవితాగాయకులు. వీరు ఆ గీతములను వల్లెవేసి గానము చేయుచుండెడివారు. ఈ రావిసులు ప్రాచీన కావ్యసేకరణ భారమును వహించిరి.

అరబ్బీ వాఙ్మయ లక్షణములు  :- (750-1258) క్రీ.శ.750లో అబ్బాసిదులు రాజ్యారోహణ మొనరించిన నాటి నుండి అరబ్బుల రాజకీయ, సంస్కృతి జీవితములందు ప్రధానమయిన మార్పులు వచ్చెను. ఖలీఫాల రాజధాని డమస్కసునుండి బాగ్దాదుకు మార్చబడెను. బాగ్దాదులో రాజకీయ, పరిపాలన, సంస్కృతి, జీవితరంగములందు పారసీక ప్రభావము ప్రాబల్యమునొందెను. ఈ విధముగా నూతన విధమైన వాఙ్మయసృష్టికి రంగము సిద్ధమయ్యెను. అరబ్బుల ప్రాచీన రాజకీయ సంప్రదాయముల నభివృద్ధి పరచుటకు బదులుగా "అబ్బాసిదులు" పద్య గద్యములను ఆదరించుచు, అపార భౌతికశాస్త్ర వాఙ్మయమునుగూడ అభివృద్ధిపరచి "సంస్కృతి" ఆశయమును విశాల పరచిరి. ఈ యుగమందలి వాఙ్మయమును మతము, భాషాతత్త్వము, గద్యము, పద్యము, చరిత్ర, భూగోళ శాస్త్రము, వేదాంతము, భౌతిక శాస్త్రములు - అను శాఖలుగా విభజింపవచ్చును.

ముస్లిముల ప్రథమ కర్తవ్యము ఖురానుతోపాటు మహమ్మదు ప్రవక్త యొక్క ఉపదేశములు, చర్యలు సంపాదించుటయై యుండెను. ఎందుచేతనన ఈ సంప్రదాయములు మత విశ్వాసముల సంబంధమునను, మత విధుల ఆచరణము నందును ఏది ప్రామాణికమో, ఏది తప్పక యాచరింపదగినదో తెలుపునవిగా నుండెను. నిత్యజీవితమునందు ఖురాను సిద్ధాంతములను ఆచరణలో పెట్టు విధానమును ఈ సంప్రదాయములు మాత్రమే నిరూపించును. రానురాను హాడిత్తుల (సంప్రదాయముల) సంచయములు పెరుగసాగెను. అల్ప ప్రామాణికములయిన కొన్ని విషయములుకూడ వాటియందు ప్రవేశించెను. కాబట్టి వాటి నన్నిటిని పరిశీలన పూర్వకముగ విచారణ సల్పి, గాలించి, ఏవి ప్రామాణికములో, ఏవి కల్పితములో నిశ్చయించిరి. ఇట్టి విమర్శనాత్మక పరిశోధనము మూలమున, ఈ సంప్రదాయములను పరంపరగా అందిచ్చుచు వచ్చిన వారి జీవితచరిత్రలు తెలిసికొని, వారిలో ఎవ్వరు నమ్మదగినవారో, ఎవ్వరు నిరాకరింపదగినవారో గుర్తింపవలసి వచ్చెను. మత ధర్మ వాఙ్మయమునకు సంబంధించిన ఈ వర్గమునకే ఖురాను వ్యాఖ్యానము (భాష్యము) చెందియున్నది. మూల