Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమెరికా సంయుక్త రాష్ట్రములు (భూగోళము)

యుద్ధములో ముఖ్యముగా పసిఫిక్ మహాసముద్రము మీద జరిగిన పోరాటములో, మిత్రరాజ్యముల వారికి విజయము లభించుటకు అమెరికా ముఖ్యకారణమయ్యెను. 1945 సెప్టెంబరులో యుద్ధము అంతమైన తరువాత అంతకు పూర్వము జరిగిన మిత్రరాజ్యములవారి సంప్రదింపులలో అమెరికా ప్రధానపాత్ర నిర్వహించెను. మొదటి ప్రపంచయుద్ధానంతరము అమెరికా అధ్యక్షుడు విల్సను కృషిఫలితముగ ప్రపంచములో శాంతి స్థాపన కొరకు ఏర్పడిన నానా రాజ్యసమితి స్థానములో ఇప్పుడు ఐక్యరాజ్యసమితి స్థాపింపబడినది. ఈ సంస్థను స్థాపించుటలో ఉద్దేశము కూడ భవిష్యత్తులో యుద్ధములను అరికట్టి ప్రపంచములో శాంతి భద్రతలను సుస్థిరము చేయుటయే. ఈ సమితి స్థాపన విషయములో కూడ అమెరికా ప్రముఖ పాత్రను వహించినది.

యుద్ధము ముగిసినప్పటినుండియు క్రమక్రమముగా అంతర్జాతీయరంగములో అమెరికా ఒక విధమైన ఆదర్శమునకు, రష్యా మరియొక ఆదర్శమునకు చిహ్నములై వైషమ్యమును పెంపొందించుకొనుచు వచ్చినవి. ఒక వైపున రష్యా తనకు అందుబాటులోనున్న రాష్ట్రములలోను, ముఖ్యముగా యుద్ధములో నష్టపడిన రాష్ట్రములలోను, కొన్ని శతాబ్దుల కాలము పాశ్చాత్యదేశముల సామ్రాజ్యవాద శృంఖలములలో బంధింపబడి యుండుట వలన ఆర్ధికముగాను, రాజకీయముగాను వెనుక బడియున్న రాష్ట్రములలోను సామ్యవాద సిద్ధాంతములను, నిర్మాణ విధానమును వ్యాపింప జేయుటకు ప్రయత్నము చేయుచుండగా, ఇంకొక వైపున అమెరికా ఇట్టి దేశములకే కోట్లకొలది ద్రవ్యము సహాయముచేయుచు అవి కమ్యూనిస్టుల వశము కాకుండునట్లును, తమ శక్తిపై తాము ఆధార పడియుండునట్లు చేయుటకును ప్రయత్నించు చున్నది. ఈ ప్రయత్నముల ఫలితము ఎట్లుండునో నిర్ణయించు అధికారము భవిష్యత్తునకు మాత్రమేకలదు.

ఆర్. ఎన్. ఆర్.

అమెరికా సంయుక్తరాష్ట్రములు (భూగోళము) : క్రీ. శ. 776 వ సంవత్సరము జులై 4వ తారీఖున 13 రాష్ట్రాలు తమ స్వాతంత్య్రమును ప్రకటించుకొనిన నాటి నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడి ఉత్తర అమెరికాలో విశిష్ట స్థానమును ఆక్రమించి ఉన్నవి. క్రమముగా విశాలమై అది నేడు 48 రాష్ట్రాలతో కూడి ఉన్నది. అలాస్కా, హవాయ్, పోర్టోరికో మొదలైన పరిసర ప్రాంతాలు కూడ చేరిఉన్నవి. ఇవి సుమారు 30 లక్షల చదరపుమైళ్ల వైశాల్యము కలిగి ఉన్నవి. జనాభా 1950 లో 15 కోట్ల 42లక్షల 33 వేలు ఉండెను. ఇందులో 12 కోట్ల 47 లక్షల 80 వేలమంది తెల్లజాతికి చెందినవారును, 1కోటి 50 లక్షల 42 వేల మంది నీగ్రోలును ఉన్నారు. అందువలన నీగ్రోలు జాతిభేదముకలవా రగుటచే వారి సమస్యను అమెరికావారు శ్రద్ధతో పరిష్కరించుకొనుచున్నారు.

పరిపాలన  : అమెరికా ప్రజాస్వామ్య దేశము. అధ్యక్షుని పరిపాలనలో ఉండును. 1787 లో ఏర్పడిన రాజ్యాంగ చట్టము ఈనాటివరకు ఎన్నో సవరణలను పొందుచు పరిపాలనను అభివృద్ధి చేయుచున్నది. రాజ్యపాలనాధికారము అధ్యక్షుని చేతిలో ఉండును. ఈయనను, ఉపాధ్యక్షుని, ప్రతి రాష్ట్రములోను శాసనసభ్యుల సంఖ్యకు సమానమైన ఓటర్లు ఎన్నుకొందురు, జాతీయపతాకములో 48రాష్ట్రాల గుర్తులు ఇమిడ్చినారు. అది 7 ఎర్ర గీతలు, 6 తెల్లగీతలతో కూడిఉన్నది. 1814 లో యఫ్.యస్.కి. రచించిన జాతీయ గీతము అవలంబించినారు. అధ్యక్షుడు కాక మిగతావారు కార్యదర్శులని పిలువబడుచున్నారు. రాష్ట్ర కార్యదర్శి(Secretary of State), కోశ కార్యదర్శి (Secretary of the Treasury), రక్షణకార్యదర్శి (Secretary of Defence) పోస్టుమాస్టరు - జనరల్, అటార్నీ జనరల్, ఆంతరంగిక కార్యదర్శి (Secretary of the Interior), వ్యవసాయ కార్యదర్శి (Secretary of Agriculture), వ్యాపార కార్యదర్శి (Secretary of Commerce), కార్మిక కార్యదర్శి (Secretary of Labour) మొదలైన వారితో కూడిన మంత్రాంగము (Cabinet) ఉండును. శాసనాధికారము కాంగ్రెసు అను సంస్థ చేతిలో ఉన్నది. ఇందులో ఉన్నత నభ (సెనేటు), ప్రజాప్రతినిధి సభ (House of Representatives) అను రెండు సభలున్నవి. సెనేటులో ప్రతి రాష్ట్రమునకు ఇద్దరు ప్రతినిధులుందురు. వారు 6 సం.లు అధికారములో ఉందురు. శాసనములు చేసే అధికారముతోపాటు, అధ్యక్షుడు ఇతర దేశాలతో చేసికొనెడు అన్ని ఒడంబడికలను 2/3 వంతు ఓట్లతో ఆమోదించవలేను.