అమెరికా ఖండము - ఉత్తరము (భూగోళము)
కలపవ్యాపారమే ప్రధానమైన వృత్తి. కెనడా తూర్పు పడమర తీరములకు కొలది దూరమున చేపలను పట్టుటకు తగిన ప్రదేశము లున్నవి. మెక్సికో ఉష్ణతీరము లందును మధ్య అమెరికా ప్రజాస్వామ్యము లందును చెరకు, రబ్బరు, పొగాకు, వనిల్లా (Vanilla), జనపనార మొదలగునవి పెంచబడును. సమశీతోష్ణ పర్వత తటము లందు కాఫీయు, విస్తారమైన మొక్కజొన్నయు పెరుగును, పీఠభూములందు ప్రత్తి, గోధుమ, మొక్కజొన్న పండును. ఇచ్చట గొజ్జెలును, పశువులును పెంచబడును. క్యూబా పోర్టోరికోలు చెరకును, పొగాకును, విస్తారముగా పండించు ప్రదేశములు. జమైకా, చెరకునకును.
బొంత అరటిపండ్లకును ప్రసిద్ధి, చిన్న ద్వీపములలో వివిధములయిన ఉష్ణమండలపు పంటలు పండును.
అమెరికా ఖండములో అధికమైన ఖనిజసంపద కలదు. కెనడాలో ఖనిజములుగల ముఖ్యప్రదేశము పెద్ద సరస్సులకు ఉత్తరమున ఉన్నది. ప్రపంచమునందలి మొత్తము నికిల్, రాగి, లోహములలో శేవ వంతు ఇచ్చటనే ఉత్పత్తి అగుచున్నది. సుపీరియరు సరస్సు ఉత్తరతీరము లందును, క్విబెక్ లాబ్రడారు లందును విస్తృతములైన ఇనుప గనులు కలవు. పోర్క్యు పైను, కర్కులాండు సరస్సుల ప్రాంతములలో వెండి, మణిశిల, బంగారము కలవు. ఇవిగాక పడమటి కార్డిలరా పార్శ్వములందు నూనెగను లున్నట్లు తలపబడుచున్నది. కెనడాయందలి ప్రయిరీల క్రింద పెద్ద బొగ్గుగను లున్నవి (1) అఫ్లాషి నా (2) దక్షిణ అప్లాషియన్ (3) ఇలివోయిన్ (4) కన్సాస్(5) ఓకహామా పెన్సిల్వేనియాలు అమెరికా సంయుక్తరాష్ట్రములందలి ముఖ్యమైన బొగ్గుగనుల ప్రదేశములు. కాలిఫోర్నియా, ఖండ మధ్య రాష్ట్రములు, టెక్సాసు, ఉత్తర అప్లాషియను, సింధుశాఖాతీరము, మెక్సికో యందలి టెంపికో మున్నగునవి నూనెను ఉత్పత్తిచేయు ముఖ్య కేంద్రములు. ఇనుము, బొగ్గులకుతోడు ప్రపంచమునందలి వెండిలో సగము భాగమును, విస్తారమైన రాగియును, మెక్సికోయందలి పీఠభూమి ప్రాంతములలో ఉత్పన్నమగును. అమెరికాలో పడమటి కార్డిల రా భాగమందురాగి, జింకు, బంగారము, వెండి, సీసము మున్నగు ఖనిజములలో చాల భాగము ఉత్పన్నమగును, అప్లాషియను పర్వతములలో అల్యూమినము గనులు త్రవ్వబడు చున్నవి. మిన్నెసోటా, విస్కాన్సిన్, మిచిగాన్, అను ప్రదేశములందు ముఖ్యముగా ముతక ఇనుము కాన వచ్చుచున్నది. అమెరికా సంయుక్త రాష్ట్రములు అభ్రకము, తగరము, మాంగనీసు, క్రోమియము, నికిలు, టంగ్ స్టను, సౌపిరము మున్నగు లోహములలో కొరవడి ఉన్నవనుట గమనింపవలసిన విషయము.
కెనడాలో పెద్ద సరస్సులకును, సెంటులా రెన్సుకును, తూర్పు ప్రదేశమున జలశక్తి ఆధారములు అధికముగా తూర్పు, ప్రదేశమున పెంపొందింప బడుచున్నవి. అట్టివి కొన్ని అంటారియో నైరుతి భాగమున కూడ కలవు. అమెరికా సంయుక్త రాష్ట్రములందలి జలశ క్తి లో అధికభాగము ఉత్తర ఈశాన్య భాగములందును, అప్లాషి యను లందును, జలపాత పంక్తి యందును, టెన్నెసీయందును ఉత్పన్న మగుచున్నది.
ప్రజలు - రాజకీయ విభాగములు : యూరోపియనులు రాకముందు అమెరికాలో ఎఱ్ఱుఇండియనులు నివసించు చుండిరి. వీరు దేశ ద్రిమ్మరులయి, వేటాడుచు ముఖ్యముగా ప్రయిరీలలో నివసించుచుండిరి. ఆజ్ టెక్కు లన బడు నాగరక ప్రజలు మెక్సికో యందును, మధ్యఅమెరికా యందును నెలకొనియుండిరి.
ప్రస్తుతము అమెరికా ఈ క్రింది దేశములుగా విభజింపబడి ఉన్నవి.
1. కెనడా: ఇది బ్రిటిషు కామనువెల్తునందలి భాగము. న్యూ ఫౌండులాండు లాబ్రడారులు కూడ ఇందులో కూడిఉన్నవి. ఇవి క్రీ. శ. 1949 లో ఇందు కలసినవి.
2. అమెరికా సంయుక్త రాష్ట్రములలో వాయవ్యమున అలాస్కాయు, పోర్టోరికోయు, పెనామాకాలువ ప్రదేశమును కలిసియున్న వి.
3. మెక్సికో ఒక ప్రజాస్వామ్య రాజ్యము. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రములకు దక్షిణమున ఉన్నది.
4. గాటెమలా, హండూరాస్, సాల్వడారు, నికరాగువా, కాస్టారికా, వెనామా అనునవి మధ్య అమెరికా యందలి ప్రజాస్వామ్యములు.
5. బ్రిటిషు హొండూరాను బ్రిటిషువారి వలస రాజ్యము.