పుట:శ్రీ సుందరకాండ.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 7

                  11
వాసికెక్కి 'పుష్పక 'మను పేరిట,
నవరత్న ప్రభ లవఘళింప, లం
కా సౌధంబుల కన్న ఉన్నతం
బయిన 'విమానము' నారసె మారుతి.
                  12
వైడూర్యంబుల వన్నెల పులుగులు,
వెండి పగడములు పెనచిన పులుగులు,
చిత్ర కాంతులను చెలగు భుజగములు,
జయ చిహ్నంబుల జాతి తురగములు.
                  13
బంగరు రంగుల పగడపు వన్నెల
ఱెక్కలల్ల సవరించుచు లీలగ,
వంచి ముక్కులను పంచాస్త్రుని పం
పునవలె గుమికొను పులుగుల జంటలు.
                  14
చెదరని ఱేకుల చెంగల్వలు తొం
డముల నున్న దంతావళముల; హ
స్తముల పద్మములు తాల్చియున్న ల
క్ష్మీ విగ్రహములు చెక్కిరి శిల్పులు.
                 15
చలికాలము కడచన సుగంధములు
నిండిన లోయల కొండవలె, మనో
హరమగు రావణు నంతిపురంబును
చొచ్చి చూచి కడు చోద్యమందె కపి.
                  16
ఆరాధింపగ నసురులు, రావణు
డేలెడి లంకను గాలించి వెతకి,
పతి గుణనిష్ఠకు బలియై వెతపడు
సీతను కానక చింతలో మునిగె.

82