పుట:శ్రీ సుందరకాండ.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శతపత్రాయిత శుక్లపీఠమును శింజన్మంజు మంజీర రం
జితపాదంబులు పాటలింపగ విపంచీ జీవతంత్రీ కల
శ్రుతులన్ తీర్చి, చతుర్ముఖావతరణ శ్లోకంబులం బాడు భా
రతి కంఠంబు ధ్వనించు కావ్య సుకుమారద్వార మీక్షించెదన్ .

తెనుగున్ తొల్లిట, సర్వలక్షణ సముద్ధిప్తంబుగా తీర్చి ది
ద్దిన దక్షుండు, సరస్వతీచయన ఋత్విజ్మౌళి, రమ్యాక్షర
ధ్వని వాచారుచి లాలనాభణితి సంపన్నుండు, నన్నయ్య బ్ర
హ్మను ప్రార్థింతు మదీయ భావ కవితామార్గంబు రక్షింపగన్ .
                                                                    (1913)

మామిడి కొమ్మమీద కలమంత్రపరాయణుడైన కోకిల
స్వామికి మ్రొక్కి యీ యభినవధ్వని ధారణ కుద్యమించితిన్ ;
కోమల గోస్తనీరుచులకున్ కదళీఫలపాకసిద్ధికిన్
లేములు దీర్చు మా తెనుగు లేతముదుళ్లు వేలార్చువేడుకన్.