పుట:శ్రీ సుందరకాండ.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ

                  11
తనివితీరగా త్రాగి, కామ లీ
లాలోలుడయి, అలసత సొలసి, విర
మించి, శయించగ మేలిమి సెజ్జను,
వీక్షించెను కపివీరుడు రావణు.

                  12
బుసలుకొట్టు గిరిభుజగమువలె, ప్రభ
లెగయు పాన్పున శయించియున్న రా
క్షస నాథుని దగ్గరి, చెదరి, చకితు
డయినట్టుల వెనుకంజ యిడెను హరి.

                  13
వెంటనె, దరినొక వేదిక చాటున
నిలిచి మహాకపి తిలకించె తడవు,
బలిసిన బెబ్బులి భంగిని మాంసల
కాయుడయిన రాక్షసరాజేశ్వరు.

                  14
రాక్షసేంద్రుడు నిరాకులంబుగా
పవళించిన తల్పము తలపించెను,
మదగంధిలమగు మాతంగము ఆ
సాదించిన ప్రస్రవణగిరింబలె.

                  15
బంగరు మువ్వల బాజుబందులు ని
గారించగ, ఇరుగడలను చాచిన
రావణేశ్వరుని రాజ బాహువులు
చర్శించెను ఇంద్రధ్వజముల వలె.

                  16
కనబడె నచ్చట కాయలుకాచి సు
దర్శన చక్రవిదారణములు, వ
జ్రాయుధ మడచిన గాయము, లైరా
వత, మని పొడిచిన వాతలు నిగనిగ.

101