పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

మదరాసురాష్ట్రీయప్రభుత్వమువారి సమాదరణమున నేఁడు తంజావూరి శ్రీశరభోజీ సరస్వతీమహల్ గ్రంథాలయము వారిపక్షమున ప్రకటితమై శ్రీకట్టా వరదరాజకవి కృతమైన ద్విపద రామాయణము తెనుఁగుభాషయందలి ద్విపదవాఙ్మయశాఖకే గాక, రామాయణవాఙ్మయమునకు ప్రత్యేకవిశిష్టత చేకూర్చిన మహాగ్రంథము. ద్విపదవాఙ్మయశాఖలో గ్రంథపరిణామమున దీనిని మించిన గ్రంధము లేదు. రామాయణద్విపదలలో నధికవ్యాప్తిగల రంగనాధరామాయణమునకు కాలక్రమము ననుసరించిన నిది ద్వితీయమేయైనను యథావాల్మీకముగ మూలగ్రంథము ననువదించుటలో నిది యద్వితీయమని చెప్పనొప్పును. మఱియు కవిరాజశిఖామణి నన్నెచోడ మహాకవి మొదలు నిన్నటివఱకు కీర్తిమూర్తులై వెలయుచున్న ఆంధ్రరాజకవులలో నగ్రగణ్యుఁడగు కట్టా వరదరాజకవి కవితావైశద్యము నెఱుకపడుటకును, నపరిశీలితమగు దేశీయద్విపదవాఙ్మయమున నీరాజకవీంద్రున కెట్టి యున్నతస్థానము కలదో నిరూపించుటకును నీరామాయణగ్రంథము విశేషముగ తోడ్పడును. కావున నిట్టి భాషావాఙ్మయచారిత్రోపకారకమగు గ్రంథమును ముద్రించిన తంజావూరి పుస్తకభాండాగారము వారికి నాంధ్రవిద్వల్లోక మెంతయేని కృతజ్ఞత చూపఁదగియున్నది.

వ్రాతప్రతి వివరణము

నేఁడు ముద్రితమైన బాల, అయోధ్యాకాండములు గల భాగమునకు మాతృక సరస్వతీమహల్ గ్రంథాలయమున 51 సంఖ్యగల సంపూర్ణరామాయణతాళపత్రగ్రంథము నుండి