ద్వంద్వప్రాసము
క. సవరాలఁ దెగడి నీలపు
సవరాలుచు కుఱులు దనరు జవరాలి కొలం
బు విరాలి గొలుప వచ్చెను
తొవరా వియ్యంపు మోము దులకింపంగన్. 450
మధ్యమయమకము
క. నావిని యావనితలమున
నావనితల మిన్న గన్ను లల్లార్చి హరిం
భావనితాంతావనతా
తావనతాంతాక్షి వీక్షణావళిఁ జూచెన్. 451
విలాసము—అపూర్వప్రయోగము
క. ఇరుదెసల వెలఁది గిరిగొని
తరళములై వెలికి బెళికి తళతళ మనుచు
న్బెరసిన జూపుల నిందిర
హరికి నివాళి యొనరించె నత్తఱి మఱియున్. 452
అనుభావము
క. అలసములు జంచలమ్ములు
నలఘువ్రీడాభరమ్ము లతినిశితమ్ముల్
గలితానురాగములనై
జెలఁగెన్ రమ హరిని జూచు జిగిబిగి చూపుల్. 453
రోమాంచము
తే. పెన్నిధానంబుఁ గనుఁగొన్న పేఁదకరణి
నలరి హర్షాశ్రుజలము గన్నులను గ్రుక్కి
కళుకు నెమ్మేనఁ బులకలు గడలు కొనఁగ
విరహపరితాపభరమున వెచ్చనూర్చి. 454
అంత్యప్రాసము—అటతాలార్ధపు ఱేకు
క. పలుకులఁ దేనెలు జిలుక
న్సలలితముఁగ నధరమునను జక్కెర లొలుక
న్గలికి మొగము సిరి దొలుకన్
నిలువున శృంగారరసము నిగ్గులు గులుకన్. 455
పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/206
Jump to navigation
Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
