Jump to content

పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

శ్రీ దే వీ భా గ వ త ము



   దృష్టాంతరూపంబున వివరించెద. నాకానొక కర్షకుండు గట్టి రేగడినేలను దున్ని దున్ని
   విత్తనంబులఁ జల్లి పలుపాటులంబడి యహోరాత్రంబు దేహక్లేశంబున కోర్చి యెప్పుడు
   పండునాయని యడియాసలం జిక్కియు గొంతకాలంబున కమ్మెళుఁకువలమాని సోమరి
   తనంబునం బైరు కాపు దిగనాడెనేని గిరికీటపక్షిజాతంబులచే నానా విధబాధావరంపరలకు
   లోనై చెడిపోయి తుదకు ఫలంబందమి కతం డెట్లు దుఃఖించువో యట్లన యగు. సత్త్వ
   గుణంబు శాస్త్రప్రదర్శనాదులచేఁ బ్రవర్ధమానంపై వైరాగ్యంబు బుట్టించునది, రజస్త
   మంబులవలనం బరాభూతంబగు రజంబు లోభయోగంబునం బ్రవృద్ధంబగు నిదియు
   నన్యగుణ సాంగత్యంబునం బరాభూతంబగు. తమంబు మోహంబునం బెరిగియు లాతి
   గొనంబుం గూడెనేని బరాభూతంబగు. సత్త్వంబు ప్రవృద్ధంపై నతఱి బుద్ధి ధర్మంబునం
   బ్రవేశించు. రజస్సత్త్వతమస్సముద్భూతంబులగు బాహ్యార్థంబులం గైకొనకుండు.
   యదృచ్చాలాభంబును యజ్ఞాది క్రియలునుం గోరుచుండు. ముందు రజంబునుం బిదపఁ
   దమంబును గ్రమంబుగా విడనాడునప్పుడు నిర్మలంబగు సత్త్వంబు నిలచు. రజంబు
   ప్రవృద్ధంబైనపుడు సనాతనధర్మంబుల విడనాడి యధర్మంబులందు శ్రద్ధప్రవేశించు.
   దమంబు ప్రవృద్ధంబై నతఱి వేదశాస్త్రంబులందు విశ్వాసంబుడిగి దుష్కర్మంబులవలన
   ధనంబార్జింపంగోరు. మఱియు శాంతిలేక ద్రోహచింతన పొడుగై నానాటికి రజ
   స్పృత్త్వంబులు తగ్గిపోవును; గామచోరభావంబుల కిఱవై యుండు; నెప్పుడును రజస్సత్త్వ
   తమో గుణంబులు ప్రత్యేకంబు ప్రవర్తింపవు. గుణంబు లన్యోన్యాశ్రితంబులు, నన్యోన్య
   జనకంబులైయుండు. నొకానొకప్పుడు సత్త్వంబు రజస్తమంబుల బుట్టించు, మఱి
   యొకప్పుడు రజంబు తమసత్త్వంబులం గలుగజేయు, నొకప్పుడు తమంబు రజస్స
   త్త్వంబులకు జనకంబగు; నిట్లు మృత్పిండంబు ఘటంబునకుంబోలెం గారణంబులగు బుద్ధి
   స్ధంబులై గుణంబులు పరస్పర కామోద్బోధకంబులగు. లోకంబున స్త్రీ పురుషులవలె
   గుణంబులు పరస్పర మిధునభావంబులం బొందుచుండు. సత్త్వంబునకు రజంబుగాని
   తమంబుగాని మిధునధర్మంబు సమకూర్చు. నిట్లు రజ స్తమంబులకును మిధునధర్మంబులు
   ప్రాప్తించుచుండునని చెప్పిన విని నారదుండు బ్రహ్మంజూచి యిట్లనియె. 170

ఆ.వె. వనజగర్భ నీదు వదనామృతంబును | గ్రోలి తృప్తిఁజెందు బేలఁగలఁడె
   గుణములెట్లు తెలిసికొనవచ్చునో చెప్పి |నన్ను ధన్యుఁజేయు మన్ననతఁడు. 171
   
ఉ. ఏనును నేర దీని గణియించి వచింప యథామతిన్ సతిన్
    ధ్యానముచేసి చెప్పెదను నారద కేవల సత్త్వమెచ్చటన్
    గానఁగరాదు మిశ్రములు గమ్యము లెట్లన సాధ్విభార్య యెం
    దేనియు భర్త కూర్మి గదియించు సపత్నికిఁ బ్రీతిఁజేయునే. 172