పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

మఱియు నీ శ్రీరామకవిగారు కవిత్రయమువారును దదనుసారులగు పెద్దనాదులును వాడిన యతులనేకాక మఱికొన్ని యతులను మఱికొన్ని ప్రయోగములను బుద్థిపూర్వకముగ వాడుక చేసియున్నారు. చదువరు లయ్యెడల శంకింతురని యెంచి యాయీ సందర్భమును గుఱించి గ్రంథాదిని విస్తరించి చర్చించియున్నారు. కావున దానింగూర్చి నిందు వ్రాయవలసినది లేదు. మఱియుఁ బ్రథమస్కందమునందు వ్యాసునికడకు బుత్రోత్పాదనమునకై దేవత లచే ఘృతాచి పంపబడినది. పిదప నమ్ముని శపించునని భయపడి పలాయితురాలైనదియు ఘృతాచియే కాని వేఱొకతె కాదు, ఇంచు నిష్క్రమణ ఘట్టమున నా ఘృతాచి యూర్వశిగా మాఱినది. ఈ ప్రమాదమును జదువరులు సవరించుకో గోరుచున్నాఁడను. శుద్ధపత్రమును వ్రాయవలసియున్నను ప్రాజ్ఞుల కద్దానితో నంతగా నావశ్యకత యుండదని యుపేక్షించితిని. మన్నింప గోరుచున్నాడను, 19వ శతాబ్ధమున నుదయించిన యాంధ్రకవులలో నిట్టికవి మృగ్యుఁడు. ఇన్ని యదృష్టములు సంఘటించినకవి లేనే లేడు.


శ్లో॥ వాంఛా సజ్జనసంగతౌ పరగుణే ప్రీతి ర్గురౌ నమ్రతా |

విద్యాయాం వ్యసనం స్వయోషితి రతిశ్లోకాపవాదాచ్ఛయమ్ |
భక్తి శ్శూలిని శక్తి రాత్మదమనే సంసర్గముక్తిః ఖలై |
రేరే యత్ర వసంతి నిర్మలగుణా స్తేభ్యో మహాద్భ్యో నమః ॥


ఈ భర్తృహరిశ్లోకమున కీ మన గ్రంథకర్తయే ప్రథమోదాహరణము.


"అనామికా సార్థవతి బభూవ."


శ్లో॥ కవిః కరోతి కావ్యాని లాలయ ద్యుత్తమో జనః

తరుః ప్రసూతే పుష్పాణి మరు ద్వహతి సౌరభమ్ ॥


కడియం చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, శతావధాని.
25-9-1928