పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

97

తే.గీ. ధనము లెక్కించుకొను నీకు | జనవరేణ్య యిటికపెల్లను బైడి నొక్కటిగఁ జూచు
      నట్టి సమదర్శనం బెట్టు లబ్బునొక్కొ | వింటి నే నిప్పు డొక గొప్ప వింత కాక.695

వ. అని మఱియు శుకుండు జనకజనవరేణ్యా! నామనం బొక్కింతయు గృహదారాదుల యందుఁ
      బ్రీతియిడదు నిస్పృహుండనై యేకాకినై నిస్సంగుడనై యహంకార మమకార రహితుండనై
      నిర్ద్వంద్వుండనై నిష్క్రతిగ్రహుండనై ప్రవర్తింప నిచ్ఛయింతు నని పలికి వెండియు.696

క. బైరాగిననుచుఁ ఱిత్తవి | కారంబులఁ బడని నాకుఁ గడుసుందరియౌ
      నారీరత్నంబేటికి | నూరేటికి విత్తమేటి కుర్వీనాథా.697

శా. నానారాగసమాకులంబయిన చింతావార్థిలో మున్గి భా
      షానైపుణ్యము నాదయంచు సకలాశాపాలనై కాశతో
      మానక్రోధమదాదులం గలసి యిమ్మాడ్కిన్ విదేహుండ నం
      చీ నీ దంభము కానవచ్చె నిజమా యీ వింతలం గంటిమా.698

క. పగతురు దండెత్తిరనుచు | బొగిలెడు విత్తంబులేదు బొక్కసమున నం
      చుఁ గడుం జింతించెదు నీ | కగునే నిశ్చింతతావహము భూనాథా.699

ఆ.వె. జగ మసత్యమనుచు సర్వదా తెలిసియు | బెట్టనోము లెల్ల పట్టి నోమ
      తిండి మాని యడవిఁ దిరిగి వైఖానసుల్ | గడవలేరు మోహజడధి జనక.700

క. భూతలనాథ భవత్కుల | జాతులను విదేహులండ్రు జను లది ఘృతకో
      శాతకి వంటిది సుమ్మని | నీతి దెలియవలయుఁగాక నిక్కముకలదే.701

సీ. విద్యాధరాభిఖ్య వెలయడే మూర్ఖుండు పేర లక్ష్మీశుండు పేదగాదె
      యల దివాకరుఁడు జన్మాంధుండు లేడొక్కొ నీ వంశమున దొంటి నృపతు లెల్ల
      మహిని విదేహనామము గలవారంచు వినుచుంటిఁ గాక సద్వృత్తి వలన
      బేరుఁ గాంచినవారు కారుసుమా నీవు మది భ్రాంతిపడనేల మనుజనాథ

తే.గి. మున్ను మీవంశకర్తయైయున్న నిమిమ | హీశ్వరుఁడు యజ్ఞమును జేయ నెదదలంచి
      యా వశిష్టు నిమంత్రణం బాచరింప | నతఁడు సురపతిచే నిమంత్రితుఁడనైతి.702

వ. అని పలికి తానును దేవేంద్రుని మఖంబు పూర్ణంబైన పిమ్మట నీ యజ్ఞంబునకు వచ్చెద
     నంతవట్టు మెల్లమెల్లన యజ్ఞార్థసంభారంబులు సంబాళించు కొనుచుండుమని చనిన నా
     రాజశేఖరుం డింకొక్కరు నిమంత్రణంబు సేసికొని యాగంబు జేసినం గోపించి యవ్వసిష్ఠుండు నీ
     శరీరంబు పడిపోవుంగాక యని శపించిన నిమి కోపించి యవ్వసిష్ఠునకు నట్టిదయగు శాపంబొసంగె
     నదికారణంబున నాటంగోలె నిమికుల సంభవులకు విదేహు లను పేరు వచ్చెనని వింటి.703