పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

169


వాదములను నీనాల్గింటివలన రాజయోగం బొప్పు. నందు
సాంఖ్యతారకామసస్కము లనం ద్రివిధంబులు. నందు సాంఖ్య
యోగంబును వివరింతు.

125


సీ.

పంచతన్మాత్రలు పంచభూతంబులు
        పంచీకృతంబులై పరఁగుచుండు
సకలేంద్రియంబులు సర్వవిషయజాల
        ములు గుణత్రయకామముఖవికార
ములుగాను దనువులు మూఁడునుగా నవ
        స్థలుగాను దగనన్నుఁ దలఁచి యెఱుఁగు
నటువంటియెఱుక నేనని నిశ్చయించి వి
        క్షేపావరణములఁ జిదిమివైచి


తే.

తాను దనలోనఁ దనుదాను దఱచితఱచి
యన్నిటకు మీఁద శేషించి యచలవృత్తి
నుండుటది సాంఖ్యయోగమై యొప్పుచుండు
గురుముఖంబున నీయోగ మఱయవలయు.

126


వ.

ఇఁకఁ దారకంబనునది యెఱింగింతు వినుము.

127


క.

అఱగన్నులతో నైనను
మురువుగ నొగి రెండుకనులు మూసియు నైనన్
బరమాత్మను లోఁజూపున
గుఱిగా నీక్షింపవచ్చు గురుభక్తుండై.

128


తే.

చంద్రసూర్యాంతరములందు సహజముగను
వెలుఁగుతారకములయందు విమలబిందు
వమరఁ గూర్పఁగ నది తారకాఖ్యయోగ
మై ప్రకాశించు లక్ష్యత్రయంబు నగుచు.

129