పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

9


సీ.

మాళవ నేపాళ మళయాళ బంగాళ
చోళ టెంకణ సింధు శూరసేన
సౌవీర కుంతల శక కళింగ కిరాత
కోసల కేకయ కుకుర సాళ్వ
ద్రవిడ పుళింద విదర్భ మహారాష్ట్ర
బర్బరాభీరాంధ్ర పాండ్య మగధ
కాంభోజ కొంకణ కాశ్మీరముఖ్యదే
శస్థులు వేంకటాచలము చేరి


తే.

పుష్కరిణిలో మునింగి శ్రీ భూవరాహ
దేవు నీక్షించి వేంకటదేవుఁ గాంచి
సకలవస్తువు లర్పించి సంతసించి
యాడుచుం బాడుచుండుదు రనయమందు.

28


క.

జలరుహసుమఫలపరిమళ
ములు మృగమదసౌరభంబు మొగి ధూపస్వా
దులు పునుగు తైలగంధము
లలరుచు వాసించు వేంకటాఖ్యపురమునన్.

29


ఉ.

అప్పురియందు దివ్యతరహాటకకుంభవిరాజమానమై
యొప్పువిమానమధ్యమున నుత్తమపూరుషుఁడై మహాత్ముఁడై
యొప్పులకుప్పయై ధర మహోన్నతుఁడై వెలుఁగొందుచుండుమా
యప్పడు వేంకటేశ్వరుఁ డహర్నిశముం గమలాసమేతుఁడై.

30


తే.

అమ్మహాత్మునిచరితంబు లాదిమునులు
సంస్కృతంబునఁ జెప్పి రాసరణి నృహరి
తెలియఁజేసినయంత నేఁ దెనుఁగుగాను
బద్యకావ్యంబు రచియింతు భక్తి మెఱయ.

31