పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

89

క. అదలించి నిలువుమనుటయొ, నదిరా కడువింత బాపనయ్య బిగువు నే
      నిది చూతుఁగాక యనినను, గదిమిన యటుఁ బోననిత్తుఁ గనకని నిన్నున్.
గీ. పట్టి మ్రింగకపోనన్నఁ బట్టఁదరమె, యేద్విజుండఁ దపోనిధి నిట్టి దుష్ట
      జంతువులు జేరునే యన్న నింతయేల, నేను భూతంబ పోనిత్తునేని యన్న.
గీ. భూత మెటుఁజేరు నాపంచభూతములును, సాక్షిగా భూతములకెల్ల స్వామియైన
      యీశ్వరధ్యానరతు నన్ను యీశ్వరుండె, పట్టుమని పంచెనని విప్రుఁ డిట్టులనియె.
సీ. ఏమీపిశాచంబ యీశ్వరుండే నిన్ను భేదబుద్ధిని బంచ ప్రేరకుండు
      కాక భూసుర యేను గర్తనే యయ్యీశు యనుమతి మ్రింగెదనంటి నిన్ను
      నవివేకభూతంబ యాబుద్ధి నీ కెట్లు గలుఁగఁజేసినది మత్కర్మ మింతె
      వెఱ్ఱిబాపడ యెల్లవృత్తులు నీశ్వరునాజ్ఞ లేకఁ దృణంబు నాడరాదు
      గాలిద్రిమ్మరి యీశుం డకల్మషుండు, హింసఁజేయించునే కాల మింతెగాక
      యోరి వినరోరి జాతిమాత్రోపజీవి, కాలమని యీశుఁడని వేరుగాదు వినుము.
క. కర్మఫల మనుభవించెద, కర్మము ఫలమిచ్చు నింతెకా కీశ్వరుఁ డీ
      కర్మము సేయించుననన్, గర్మం బీశ్వరుని నంటుఁగదవె పిశాచీ.
మ. అనినన్ గర్తయు భోక్త కారణము కార్యంబెల్ల నీశుండె తా
      వెనుగుం బాపడ నోరిసేయను సుఖాభివ్యక్తకర్మంబు లెం
      చునుఁ గన్పట్టుడు నెన్నఁగాఁ బ్రకృతియందుం జూవె తద్రూపమై
      చను నెందున్ గుణజాత మీశుఁ డమరున్ సాక్షిత్వ మాత్రంబునన్.
గీ. అనిన బ్రాహ్మణుఁడవుగావు మునుపె నీకు, వేదమును రాదు శిక్షయు లేదు శుంఠ
      సత్యమంతర్బహిశ్చతత్సర్వమనియు, వ్యాప్తనారాయణస్థిత యనెడు చదువు.
గీ. ఉండు నిండి యధస్తిర్యగూర్ధ్వములను, స్వామి నారాయణుండను జదువు వినవె
      వేదశిరము లవేమన్న విశ్వమెంత, నంద నొక్కొకయెడల వినంగ లేదె.
క. జందెముఁ జూచియు భ్రమసితి, నెందు కులాలుండువౌదు వేమోయన భూ
      బృందారకుఁ డోరసి యల, మందరకే పుట్టినావొ మహి వక్త్రోక్తిన్.
గీ. సేయబడనవి సేయుట సేయువాఁడ, నొక్కడంటివి వచనంబు లొక్కకొన్ని
      చెప్పితివి మేలు మారటచెప్ప నాతి, యీశ్వరుఁడు వేరుగా మది నెన్నికొనుము.
క. యుక్తమగు కార్యసాధన, శక్తిన్ సకలంబు నతఁడు సాధించు క్రియా
      శక్తిని శుభాశుభంబులు, సక్తములుగ ననుభవింప జనులు వలసెన్.
క. ఈశుఁడు విలక్షణుండౌ, దాసీకన్యాకరమయ దబ్బర వినరా
      యాశాపాశ కులాధమ, లేశంబును వినియు నెఱుఁగలే వేమందున్.