పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

141

      ఖండలశయానునకు దండము విమానవర
                  మండనునకున్ హరికి దండ మిదె నీకున్.
క. సేవింపక నిను మదిలో, భావింపక నీదు పాదపద్మము లెందున్
      సేవింతుమనుచు నెంచక, యేవగ నెవ్వాఁడు ముక్తి కేగు ననంతా.
క. నీవే నిగమము లన్నియు, నావేదములెల్ల నెన్ని యభినుతి సేయున్
      దేవా శ్రీవల్లభ దయ, నీవే నీవేదములు నిజేకాంతనిధీ.
గీ. అనిన చిఱునవ్వు నవ్వి శేషాంగశాయి, అటుల నీకొనఁగూడునా నాగమములు
      శక్తి యాయువు బుద్ధి కొంచెంబు నరుల, కఘము లణఁగక రావు నీ కాగమములు.
గీ. నీకు నఘములు వాయు సునేత్రుచేతఁ, గలుగు నిగమంబులెల్ల నాఖగవతంసుఁ
      జేరి నామాట లీవు వచించు మచటి, కేగుమని రంగశాయి యదృశ్యుఁ డయ్యె.
క. పోయె ప్రభాకరుఁ డచటికి, నాయండజయోగి యపుడు నమ్మునివరుచే
      నాయర్థమెల్ల విని రం, గాయతనము నెడలి పుష్కరావలిఁ జేరెన్.
గీ. మొదట సంకల్పములు జెప్పి ముసలిబాతు, బాపనయ్య మునింగి దే పాపమెల్ల
      బాసి తా నుపదేశించె పావనాత్ముఁ, జేసెను ప్రభాకరుని రంగవాసుకరుణ.
క. వేదములన్నియు మదిలో, బాదుకొనన్ దాఁ గృతార్థభావనుఁ డయ్యెన్
      వేదార్థ యనుచు సజ్జను, లాదిం బలుకంగవింటి నవనీనాథా.
సీ. ఆప్రభాకరుఁడును హతశేషకల్మషుఁడై పుష్కరిణీతీర్ధ మాడు కతన
      యాగమంబులు నేర్చి హరియందు సాయుజ్యపదవి నొందె సునేత్రపక్షి యటుల
      కైవల్యమున కేగె నావిహగోత్తమునుత నిర్విశేషశిష్యులమునన సు
      వర్ణబిందుండను వరతామ్రచూడుఁడు ఘనబృహన్మతులు నా గడఁగువారు
      ననను నాపేరు సుదర్శనుఁ డటండ్రు, నలుగురికి నేర్పె నిగమముల్ నాల్గు నతఁడు
      వెలసె శాఖలు మన్నాములనెడినాల్గు, దాచ నిఁక నేల యేతదర్థంబు వినుము.
క. ఆచార్యుఁ డున్నయటులనె, వాచంయమి సుతులమయ్యు వరవిహగాకా
      రాచారరతుల మైతిమి, మాచే నధ్యయనవాంఛ మౌనికుమారుల్.
శా. నానారూపనిహంగమాకృతుల నున్నా రిద్దఱం జూచితే
      భూనాథోత్తమ యోగనిద్రను జగంబుల్ బ్రోచు రంగేశ్వరున్
      ధ్యానారూఢి భజింపుచున్ నిరతమున్ దత్తుణ్యతీర్థస్థలం
      బానందంబున బాయలేక పరలోకాపేక్ష స్వేచ్ఛారతిన్.
క. మఱికలదే యెందే నిహ, పరసౌఖ్యము లాత్మఁ గోరు భాగవతుల కా
      దరు దెందు రంగనాయక, చరణమె శరణంబుగాక జగతీనాథా.