పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

శ్రీరంగమాహాత్మ్యము

క. కదళీఫలములు వేల్చిన, యది నృపవశ్యమగు నేతియాహుతు లిరువేల్
      పదివేలు నైదువేలున్, గుదురుగఁ జేయవలెఁ గోరుకోరిక కొలఁదిన్.
క. ఆకలశోదకములచే, శ్రీకరముగ స్నాన మపుడు చేసి నివాళుల్
      గైకొని వ్రతము సమాప్తిగ, నేకడ సంకల్పసిద్ధి నెసఁగుచు నుండున్.
క. నవమీవ్రత మెఱిఁగించెద, నవధాన్యముతోడ వినుమ నా కావేరీ
      నవిధప్రవేశ మైనన్, మివుల ఫలంబిచ్చు లేక మేదినియందున్.
ఉ. ఏనదినైన గ్రుంకి సకలేశ్వరుఁ గృష్ణుని రుక్మిణీవిభున్
      ధ్యాన మనర్చి యందు సికతాస్థలి నుండదలచి వశ్యముల్
      సూనములున్ ఫలాదులును శోభనవస్తుల పూజసేయు క
      న్యానియమంబగున్ తగినయట్టి వరుండొనఁగూడు గోరికన్.
ఉ. నేయును పాలునుం బెరుగు నించినపాత్రలు వాయనంబుగాఁ
      జేయుచు దానమీవలయుఁ జేకొని యేవుర పేరఁటాండ్రకున్
      పాయక వారి వల్లభుల పంక్తిని భోజనమాచరింపఁగాఁ
      జేయుట యెయ్యెడన్ నవమిసిద్ధము లిట్టి వ్రతప్రచారముల్.
చ. దశమిని దండ్రి సోదరియు తల్లియు మున్నగువారిలోపలన్
      గుశలముఁ గోరి కన్యకలకున్ వ్రతముల్ నడిపింపనొప్పు దా
      నశనము మాని యానవమియం దుపవాసము జేసి యిందిరా
      వశుందలంచి కుంభము నవారిగ నుంచదగున్ యురస్థలిన్.
గీ. హృద్యమైన గుడాన్ననైవేద్య మిచ్చి, తిలలు మండలముగ నుంచి తిలశితాక్ష
      దళసరోజంబు వ్రాసి యంతకుని గమల, భద్రకర్ణిక నావహింపంగవలయు.
క. మొదలన్ కలశముపై శ్రీ, సదనుని బంచాయుధము లెసంగించి ముదం
      బొదువ నిరుగడలఁ బూజలు, సదమలమతిఁ జేయవలయుఁ జక్కని విరులన్.
గీ. తనమనోబుద్ధి హంకారతతులఁ గూర్చి, కాలమూర్తిని లక్ష్మీశుగాఁ దలంచి
      కలశవిహితాయుధాంచితుగాఁగ నాత్మ, భావనము జేసి కాంచనప్రతిమ నునిచి.
క. పేదను విప్రకుటుంబి స, మాదరమున బిల్చి యధికమగుదక్షిణతో
      శ్రీదంబకు కాలప్రతి, మాదానమొనర్చి విప్రమండలి కెల్లన్.
గీ. కామితాన్నంబు లిడి యందు కలశవారి, చేత నభిషిక్తుఁడై యున్న శేష మపుడు
      బాంధవులఁ గూడి భుజియింపఁ బాయు నఘము, నాయు వభివృద్ధియగు సిరు లతిశయిల్లు
క. ఏకాదశీవ్రతం బిది, లోకస్తవనీయ మెల్లలోకంబులలో
      లోకవ్రత సాధారణ, మాకాదర నిత్య మంగళప్రద మెందున్.