పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

శ్రీరంగమాహాత్మ్యము

ఉ. చూచి యభీష్ట మెద్ది యనుచున్ గురుశేఖరుఁ డానతిచ్చినన్
      ప్రాచిరవిం గనుంగొనిన బద్మములుంబలె నుల్లసిల్లుచున్
      గోచరభాగ్యరాశి యని కోరిక లీరిక లెత్త బల్మరుం
      జూచుచు నాత్మలోఁ బరమశోధనకారణు లై మహామునుల్.
శా. ఆచక్రాచల మైనతీర్థముల నాయాసంఖ్యలం జూచి ము
      ఖ్యాచారక్రియ లెందు నేమరక మే మశ్రాంతముం జుఱ్ఱియున్
      మీచేఁ గాని మనఃకళంకవికృతుల్ మీటంగ మార్గాంతరం
      బాచార్యోత్తమ కానలేక భవదీయాంఘ్రుల్ శరణ్యంబుగన్.
గీ. వచ్చితిమి మాతలంపులు వరుస నీకు, విన్నపముఁ చేసి తగినవి వేడి మీర
      లానతియ్యంగ వినుమని యాదరమును, నాగదంతుని నియమించినార మిపుడు.
క. ఆనాగదంత మునితోఁ, బూనిక గారుడపురాణమున సందేశం
      బానతి యిండన వ్యాసులు, కానిండని వారిమీఁదఁ గరుణాపరతన్.
క. ఆనాగదంతుఁ గనుఁగొని, యే నెఱుఁగుదు వీరితలఁపులెల్ల నదైనం
      గానిమ్ము వేడు మెయ్యది, యేననవుడు గేలు మొగిచి యిట్లనిపలికెన్.
సీ. ఎవ్వాడు రక్షించు నీవిశ్వమంతయు నెవ్వఁడు రక్షించు నీప్రపంచ
      మెవ్వనిలోపల నిమిడియుఁడు జగంబు చేసె నెవ్వఁడు సర్వజీవసృష్టి
      యీపోడుములమాయ నెవ్వఁడు గల్పించె నెవ్వని నిగమంబు లెఱుఁగలేవు
      సకలశబ్దార్థవాచ్యంబు లెవ్వనిమూర్తి యంతకుఁ దా కర్త యెవ్వఁడయ్యె
      నట్టి యీశ్వరుఁ డెవ్వఁ డీయంబునిధులు, ద్వీపములు తత్ప్రమాణంబు దివ్యదేశ
      తీర్థపుణ్యవ్రతాదుల తెఱఁగు లెఱుఁగు, బెల్లఁ బేర్కొనుఁ డెందు నభిజ్ఞులగుచు.
గీ. అనిన నక్షరు నవ్యయు నాదిపురుషు, శ్రీశు నచ్యుతు హరి హృషీకేశు బరము
      సర్వమయు విష్ణు తామానసమున దలఁచి, మ్రొక్కి యిట్లనిపలికె నమ్మునివరుండు.
సీ. ధన్యమానస విను తత్పరమతితోడ గారుడసంహితఁ గలతెఱంగు
      దక్షుండు మును దేవతాసమూహము మౌనిగణములు గూడి యాగంబుసలుప
      నాయాగశాలలో నధ్వరుఁ డుద్గాతబ్రహ్మయుఁ దమతమపనులు నడప
      నందు నుద్గాతకర్ణామృతంబుగ సామగానంబు సేయ నాకాశవీథిఁ
      బుట్టె నొకమ్రోత జగము లిట్టట్టుగాఁగ, దిశలు ఘూర్ణిల్ల మౌనులు దిగులునొంద
      వేలుపులు మ్రానుపడ సభ వెఱగుఁజెంద, దక్షుఁ డిది యేమి యనుచుఁ జిత్తమున గలఁగ.
క. ఆసామగాన మప్పుడు, చేసిన నామంత్రణంబుఁ జెలువమర త్రయీ
      వాసి సనాతనుఁ డాగమ, భానురతనుఁ డింద్రముఖసుపర్వులుఁ గొలువన్.