పుట:శృంగారశాకుంతలము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

శృంగారశాకుంతలము

గీ. చందనంబునఁ బుష్పంబు గుందనమునఁ
     బరిమళం బిక్షులతికను ఫలమువోలె
     రతిమనోహరమైన యీయతివమేన
     నరయఁ గనుగొంటిఁగాదె యీయౌవనంబు.62
వ. ఈలతాతన్వి తపస్వినీచిహ్నంబులు పూనియున్నను నెరవు దోఁచుచు
     శరీరకాంతి సౌందర్యసౌభాగ్యంబువలన రాజసంబును, ప్రతాపంబును,
     గర్వంబును, ఠేవయు నించుకించుక ప్రకాశించుచున్న యవి, మౌనికన్యా
     కలితంబగు బ్రహ్మతేజోవిశేషంబు కేశంబును గాన[1]రాకున్న దది
     యట్లుండె.63
ఉ. సందియు మేల యీవికచసారసలోచన రాజపుత్రి నా
     డెందము మౌనికన్యలబడిం జననేరదు నిక్కువంబ యే
     చందమునందు సంశయవిచారపదం బగునట్టి వస్తునీ
     మం దమచిత్తవృత్తులు ప్రమాణము లుత్తములైనవారికిన్.64
ఉ. పౌరవవంశసంభవుల పావనచిత్తవిధంబు లన్యకాం
     తారతికిం బ్రమోదభరితంబులు కావు ప్రకంప మొంది యీ
     ధారుణి సంచలించినమ దామరచూలి వరంబు దప్పినన్
     వారిధు లింకినన్ మఱి దివాకరచంద్రులు తప్పఁ గ్రుంకినన్.65
క. కానీ సంశయ మెల్లను
     [2]మానుం బరిపాటి వీరిమాటలవలనన్
     లోనున్నరాగి వెలుపల
     గానంగావచ్చు పూఁతకడియముభంగిన్.66
గీ. వీనులకుఁ బండువులుగాగ వీరిమాట
     లాలకించెదఁగా కని యధిపుఁ డుండె
     నంత నొకతేటి వచ్చి శకుంతలాము
     ఖాంబుజమునందు ముసరిన నలఁత నొంది.67

  1. రాదున్న దది యట్లుండె
  2. మానీ