పుట:శృంగారశాకుంతలము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

21

     దిట్టమాటలం బుట్టిన జగడంబులు విగడంబులై యుద్ధపతత్తంబు లగు
     పంతంబులఁ గుంతంబులం గొనివచ్చు జూదరిఘట్టంబుల హెచ్చగు రచ్చ
     కొట్టంబులును, గలిగి వినోదంబులకు నాకరంబును, విశ్రామంబులకు
     సీమయు, విక్రమంబునకు నెలవును, విజయంబునకుఁ దావకంబును, విద్య
     లకు నుపాధ్యాయయు, వితరణంబులకు సదనంబును, విభవంబులకు బ్రభవ
     స్థానంబును, విలసనంబులకు వినిమయంబునునైన యప్పురి కధీశ్వరుండు.86
సీ. విశ్వసన్నుతశాశ్వతైశ్వర్యపర్యాయ
                    కుటిలకుండలిరాజకుండలుండు
     దిగిభశుండాకాండదీర్ఘబాహాదండ
                    మానితాఖిలమహీమండలుండు
     జనసన్నుతానన్యసామ్రాజ్యవైభవ
                    శ్లాఘాకలితపాకశాసనుండు
     కులశిలోశ్చయసానుకోణస్థలన్యస్త
                    శస్త్రవిక్రమజయశాసనుండు
తే. భాసమానమనీషాంబుజాసనుండు
     సకలదేశావనీపాలమకుటనూత్న
     రత్నరారజ్యదంఘ్రినీరజయుగుండు
     శంబరారాతినిభుఁడు దుష్యంతవిభుఁడు.87
మ. రజనీనాథకులావతంసుఁ డసిధారాదారితారాతిరా
     డ్గజకుంభవ్రణమార్గనిర్గళితముక్తారక్తహారుండు స
     ద్విజసుతర్పణకేలిలోలుఁ డఖిలద్వీపావనీపాలది
     గ్విజయాన్వితుఁడు పాపభీతుఁడు మహావీరుం డుదారుం డిలన్.88
మ. ప్రజ లెల్లం జయవెట్ట ధర్మమహిమన్ బాలించె వీరారి భూ
     భుజుల న్వేల్పులఁ జేసి యధ్వరములం బ్రోచెం బదాంభోజన
     మ్రజనాధీశులఁ గాచి నిల్పె నిజసామ్రాజ్యంబుల న్సర్వసా
     ధుజనస్తుత్యుఁడు సత్యకీర్తి యగు నాదుష్యంతుఁ డత్యున్నతిన్.89