పుట:శృంగారశాకుంతలము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

15

సీ. విలసితంబైన కావలి వెన్న మారాధ్య
                    మణిదత్తయగు శైవమంత్రశక్తి
     సమధికస్ఫూర్తితో శాశ్వతైశ్వర్య
                    బీజంబైన శంభుపూజాఫలంబు
     ప్రమథాధిపతి గూర్చి భక్తితోఁ
                    గావించు సోమవారవ్రతసుకృతగరిమ
     యన్నమాంబిక కంధరాంతరంబునఁ
                    జాల శోభిల్లు మంగళసూత్రలక్ష్మి
తే. సకలసౌభాగ్యములకును సాధనములుఁ,
     గారణంబులుఁ, దగు బోధకములుఁ, గాఁగ
     సచివసంఘములోనఁ బ్రశస్తి గాంచె
     విశ్వనుతకీర్తి చిల్లరవెన్నమంత్రి.62

షష్ఠ్యంతములు


క. ఏతాదృశగుణగణవి
     ఖ్యాతునకును నిత్యఘనదయాన్వితునకున్
     శ్రౌతపదానందునకును
     బోతాంబాగర్భజలధిపూర్ణేందునకున్.63
క. శరనిధిగాంభీర్యునకును
     బరహితకార్యునకుఁ దుహినపర్వతకన్యా
     వరపదపంకజపూజా
     కరికాలునకును నిరస్తకలికాలునకున్.64
క. బాలామదనునకు రమా
     హేలాసదనునకు బంధుహితజనరక్షా
     శీలాయతమతికిని నిఖి
     లేలాజనవినుత సురమహీధరధృతికిన్.65
క. కౌండిన్యగోత్రునకు ను
     ద్దండాహిత సచివమతిలతాదాత్రునకుం