పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 235

జనుదెమ్ము కంచ మిడినది
యనుచుం గను గీఁటి పిలువ నాతఁడు మదిలోన్. 523

తే. కల్లవగజూదకత్తెలఁ గంటిఁగాని
యింతమాయల జగజంత నెండుఁగాన
నెట్లు నమ్మెడి దొర యీయింట దీని
కడమనడతలు తెలుతముగాక యనుచు. 524

క. చని యది వడ్డింపఁగ భో
జనకృత్యముఁ దీర్చి యంతఁ జలజాప్తుఁడు గ్రుం
కిన దానికన్ను సన్నం
గని కూటములో వసించె గంకటిమీఁదన్. 525

చ. మదవతి యంత నాత్మవిభు మన్మథకేళిని దేల్చి కూటి చొ
క్కొదవఁగ నిద్రఁజెందు పతి నొయ్యన నారసి లేచి చెంబుతో
నుదకముఁ గొంచు ధూర్తమణి యుండెడి చోటికి నేగి మాయపు
న్నిదురవహించి యున్న యతనిం గరసంజ్ఞల లేపి యిట్లనున్. 526

క. ఏమోయి నిన్న నడిచిన
నామాటలు పొంచి విని ఘనంబై తగుమ
త్ప్రేమ యొనఁగూర్పవచ్చిన
సామివి గద నిన్ను మెచ్చఁ జనదే నాకున్. 527

ఆ. అందగాఁడ వగుదు వప్పుడె కంటి నీ
దారి మగఁడు నిద్రఁ దేఱి నన్ను
వెదకు నటకుమున్ను వేగఁ బోవలయు నీ
జోలి యేల ప్రక్కఁ జో టొసంగు. 528