పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 149

క. పతిఁ బ్రక్కఁ బండినప్పుడు
రతి కొంగక నిదురవోదురా యయ్యో నా
చతురుఁడ గుఱకలు చాలున్
గతి చెప్పు మటుంచు వానిఁ గడు బాధించున్. 107

క. ఇట్టివగనడుచుతనవగఁ
జుట్టములకుఁ దెలుపు మగని సుద్దులు విని యా
దిట్ట చని వారితో మఱి
యెట్టువిడుం దన్ను నాథుఁ డొల్లఁడటంచున్. 108

తే. మఱియు నమ్మాయలాఁడికోమటినెలంత
లందఱును గువ్వకోల్గొని యగడుసేయ
వారిఁ గూర్చుండఁబెట్టి నావర్తనంబు
దెలియదే కద మీకంచుఁ బలుకఁ దొడఁగు. 109

ఉ. అన్నెముపున్నె మే నెఱుఁగనమ్మ మతిం బతి నాదుపాలికిం
బెన్నిధి గాఁగఁ జూతు మెఱమెచ్చులుగా వొరునెట్టివాని నే
గన్నులనైనఁ జూడ నిది కల్లయొ సత్యమొ చూచుచున్నవాఁ
డన్నలినాప్తుఁ డింకొకటి యారజ ముట్టిపడ న్మెలంగుదున్. 110

తే. అట్లు మెలఁగుట యేమిటి కంటిరేని
నింక నెక్కడిసిగ్గు మాయింటియతని
కాసపుట్టింప మెలగుదు నట్టులయ్యు
బూచివలెఁ జూచుననువానిఁ బొడిచిత్రోయ. 111

చ. కలిగినవాఁడుగా మరునికన్నను వన్నియగల్గువాఁడుగా
కులమున మేటిగా సవతిగోరము గానమటంచు నెంచి వే
డ్కల కెదురేగుదు న్మగఁడు గల్గియు లేనివిధంబు సేసీ తా
నెల గలనైన నన్నుఁ గరుణింపఁడు భోగమువారిపొందునన్. 112