పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 145

తే. నేఁటి కీపాటి నీవు నాత్రాటిమహిమ
నింటి కేతేరఁ జల్లగాఁ గంటి నింక
నిదియె పదివేలు వైభవం బెల్లనాఁడు
నల్లపూసలు చెవియాకు నాకుఁ జాలు. 84

క. అని ధైర్యమిచ్చి తగమ
జ్జనభోజనములను దృప్తి సలిపి దినాంతం
బున నాతండును దాఁగే
ళినిశాంతముఁ జేర సరిగె లీలాపరతన్. 85

క. ఈకైవడి నెచ్చెలి తన
యాకాంక్షలు దీర్ప నిర్భరానందముతో
నాకోడెకాఁడు చివురుం
జేకత్తివజీరు సడ్డసేయక యుండెన్. 86

తే. వచ్చె విమలుండు నిస్తులవస్తుచయము
గొనుచు నింటికి వచ్చిన ఘోరకలహ
మయ్యె ధనవంతునకు వాని కాగృహంబు
నాదియన నాదియనఁగ నౌఁ గా దనంగ. 87

క. పురజనులు తమ్ముఁ గనుఁగొని
యిరువురియాకార మొకటి యేర్చఱుపఁగ నె
వ్వరివశ మనుచుం జూడఁగ
దొరముందఱఁ బడిరి వాదుతోడ న్వారల్. 88

క. ఆదొర యేగతి వారల
వాదుడు పన్వలయు వింటివో వినలేదో
పైదలి యనినఁ బ్రభావతి
మోదము వెలిఁజిలుకఁ జిలుక మొకరికిఁ బలికెన్. 89