పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


[1]రాఢాపురీహర్మ్యరత్నహేమగవాక్ష-
          సంవేశనక్రియాసౌష్ఠవములు


గీ.

వలనుగాఁ జంపకారణ్య[2]వాటిఁ దరిసి
కాశి యొరసి కళింగాంధ్రదేశసరణి
దక్షిణము సాఁగెను సపాదలక్షశైల
[3]కటకబంధుఁ డుదగ్దిశాగంధవహుఁడు.

28


గీ.

చలి ప్రవేశించు నాగులచవితినాఁడు
మెఱయు వేసవి రథసప్తమీదినమున
నచ్చసీతు ప్రవేశించుఁ బెచ్చు పెరిఁగి
[4]మార్గశిర పౌషమాసాల మధ్యవేళ.

29


గీ.

ఇనుఁడు కోదంటరాశిమీఁ దెక్కువేళ
నిక్షుకోదండవల్లి యెక్కిడు మరుండు
సమదవేదండసమమహాసత్త్వుఁడయ్యు
జనుఁడు కోదండమును బోలెఁ దనువు వంచు.

30


గీ.

ఇండ్ల మొదలను నీరెండ [5]నీరికలను
ననుఁగుఁదమ్ముఁడు నన్నయు నాటలాడు
నత్తయును గోడలును గుమ్ములాడుఁ గుమ్ము
[6]గాఁచుచోటికి మకరసంక్రాంతివేళ.

31


సీ.

కాశిలోఁ జక్రపుష్కరిణి [7]దుష్కృతశుష్క-
          గహనావళీదావదహనజిహ్వఁ
గుక్కుటేశ్వరవరకుండి [8]పిఠాపురి-
          నఘతమస్కాండచండాంశుదీప్తి
దక్షవాటంబు సప్తర్షిగోదావరి
          కలిదోషపాషాణకులిశధార
గౌతమీతటిని మార్కండేయుపురి మ్రోల
          దురితాహిసంఘాతగరుడమూర్తి


గీ.

నిన్నిటను దీర్థమాడంగ నేఁగుదెంతు-
రఖిలమునులుఁ బ్రభాతసంధ్యాగమముల
గ్రహగణేశుండు కోదండరాశిఁ బాసి
మకరమున కేఁగుదేరంగ మాఘవేళ.

32


మ.

పఱివోయెం దుహినంబు పండె వరి యిప్పల్ వూసె శైలంబుల
[9]గఱివోగట్టెన్ వలరాజు తేఁటియెఱకం గాండప్రకాండంబులం
జఱపించెన్ గ్రహరాజు [10]మాఠరకునిం జక్రాద్రికూటంబునం
దఱిఁ గౌబేరదిగంతరిక్షపథయాత్రాజైత్రతుత్తుంభమున్.

33


వ.

వెండియుం జకోరలోచనల కుచమండలంబులకుఁ గర్పూరఖండక్షోదంబుల మేదించిన చందనానులేపనైపథ్యం బపథ్యంబయ్యె.

  1. తా. రాధరాపురి
  2. తా. పాళి
  3. తా. కటకబంధుండు తద్దిశా
  4. తా. మార్గపౌషమాసంబుల మధ్యవేళ
  5. ము. నీడికలను
  6. తా. గాయుచోటికి
  7. ము. దుష్కరశుష్క
  8. ము. పీఠపురి శంకాతమస్కాండ
  9. తా. గరిమందెన్
  10. తా. మాఠరునిచే