పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

ఇష్టదేవతాప్రార్థనాదికము

క.

శ్రీతరుణీ[1]సితవిలసన-
జాతశివానూనభక్తిసంపద్గురు వి-
ఖ్యాత[2]నుతకీర్తి సితజీ-
మూత[3]సితాఖిలదిగంత ముమ్మయశాంతా.

1


ఆ.

అక్కథకుఁడు శౌనకాదులైన మహాము-
నీంద్రులకుఁ బ్రియమున నిట్టులనియె
నట్లు భూమి విడిచి యరుగవలయు నింక
ననుచు మాటలాడు నవసరమున.

2


క.

తెలతెలవాఱుచు వచ్చెం
బలపలనయ్యెం బయోదపథమునఁ దారల్
[4]కలవింకంబుల కోమల-
కలకలములు చెలఁగెఁ [5]గాళికావిపినమునన్.

3


సీ.

సంభోగపరిఖిన్నశబరసీమంతినీ-
          స్వేదవార్బిందువిచ్ఛేదకారి
విఘటమానాంభోజవిపినషండమధూళి-
          పరిమళాసారసంపర్కసురభి
సమదకాంతారకాసరయూథ[6]రోమంథ-
          సంభూతడిండీరశకలవాహి
లలితలుంగలవంగలవలీమతల్లికా-
          లాస్యోపదేశలీలాగురుండు


గీ.

యామినీశేషతుహినధారానుషంగ
జడిమభరమంద [7]సంచారచతురశాలి
యల్లనల్లనఁ [8]బొలుపారె నడవిలోనఁ
గాల్యసంధ్యాసుగంధుండు గంధవహుఁడు.

4


ఉ.

క్షోణిరుహాగ్రభాగముల జోకలుగట్టి వనీశిఖావళ-
శ్రేణులు తాండవంబు లొనరింపఁగ మంద్రగభీరభంగి శ-
ర్వాణిగృహంబులోని బలివైభవలీలకు మ్రోసెఁ గంచుని-
స్సాణము మాటిమాటి కనుశబ్దము లీనఁగ గోపురంబు[9]నన్.

5


శా.

నిష్ఠాసంపద నర్ఘ్యపాణు లగుచున్ విప్రుల్ ప్రశంసింప మం-
జిష్ఠారాగము లంబకంబున నధిష్ఠింపన్ నిలింపాద్రిభూ-
కాష్ఠామధ్యమునందుఁ దోఁచెను శతాంగప్రష్ఠసర్పద్విష-

  1. తా. సుర
  2. తా. తరకీర్తి
  3. తా. శివాసిత
  4. ము. కలకలవింకల కోమల
  5. తా. కాళి విపినములోనన్
  6. ము. సమ్మర్ద
  7. ము. చతుర సంచారకారి
  8. ము. బొలుపారు నడవి నడుమఁ
  9. తా. లన్