పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

రత్నాంశుదీపాంకురములచేఁ బాయదు
          యౌవనోద్భూతమైనట్టి తమము
శిశిరోపచారంబుచేత సాధ్యముగాదు
          ప్రత్యగ్రమైన దర్పజ్వరంబు
మంత్రమూలములచే మణులచేఁ దేరదు
          విషయవిషాస్వాదవిషమమూర్ఛ
సలిలాభిషేక శౌచములచేఁ బోవదు
          ఘనభోగమను పూతిగంధకళిక


గీ.

యామవతిఁ దెల్లవారిన నణఁగిపోవ-
దుదరసుఖసన్నిపాతనిద్రోదయంబుఁ
బ్రతిదినంబును లక్ష్మీసురామదంబు
విరియనేరదు పరిణామవేళయందు.

106


క.

[1]ఏమగునొకొ బాంధవమున
నామలకశలాటురసము యౌవనలక్ష్మీ-
సామగ్రికినా యొగరు గ-
దా మధురత యొసఁగు విషయమను జలమునకున్.

107


గీ.

[2]జవ్వనమునను సదుపదేశములు గావు
తి(ఱ్ఱిఁబోసిన సలి)లంబు తెఱుఁగు దోఁప
శంబరారాతిపుష్పాస్త్రసంప్రహార-
జర్ఝరీభూతమగు మనస్సంపుటమున.

108


వ.

తండ్రి! గురూపదేశం బఖిలమలప్రక్షాళనక్షమంబైన తీర్థస్నానంబు, జరామరణవైకల్యంబు లేని వార్ధకంబు, మేదోభారంబు లేని గౌరవంబు, సువర్ణరచన లేని కర్ణాభరణంబు, నుద్వేగంబు లేని ప్రజాగరంబు; [3]ఇది యభవ్యులకు సలిలంబునుం బోలెఁ గర్ణస్థితంబై యుపద్రవంబు నాపాదించు. నీ విటవట్టి నెట్టుకొని పెద్దలమాట వినుము, వింటేని ధూర్తులు నిన్నుఁ [4]బ్రశాసింపలేరు, *(కుటిలులు నిన్ నలమరింపలేరు), వంచకులు నిన్ను వంచింపలేరు, పల్లవులు నిన్ను వలపింపలేరు, మదంబు నిన్నుఁ గదల్పలేదు, [5]విషయంబులు నిన్ను నాశ్లేషింపలేవు, విను మనూచానాచారంబును, నాముష్యాయణంబును, [6]నామేధితామ్నాయంబును, నధీతాశేషశాస్త్రంబును, [7]నలింగవృత్తియు, [8]ననవకీర్ణంబు, ననభ్యుదితంబును, ననభిష్ఠుతంబునునైన [9]యాయావరవంశంబునం బ్రభవించినాఁడవు మూఢుఁడవై యనుష్ఠానబంధంబులగు విషయోపభోగంబులయందు సుఖబుద్ధి యారోపించెదవు. నీయట్టి [10]దుర్బుద్ధిశీలురుగదా నిస్త్రింశంబుఁ జూచి కువలయమాల యనియును, గృష్ణసర్పంబు వీక్షించి కాలాగురుధూమరేఖ యనియును, నంగారంబు [11]దర్శించి బంగారం బనియును భ్రాంతిఁ బొందుదురు. దుందుమార[12]కరంధమ మాంధాతృనహుష నాభాగసన్నిభుండు వింధ్యాచలపతి, హేమాంగదుండు మనల గురుస్థానంబుగా మన్నింపుచున్నవాఁడు. మన వంశంబునకు నీవొక్కండవ సంతానబీజంబ వింతయు నెఱింగి బుద్ధిమంతుడవై మమ్ము నుద్ధరింపవలదా యని*(పలికి) మంత్రి కన్నీరు దొరఁగ

  1. తా. ఏమఉనొకొ
  2. తా. జవ్వనములు
  3. తా. ఇట
  4. ము. బ్రశంసింప
  5. ము. విషయంబు
  6. తా. నామ్రేడితామ్నాయనంబు
  7. తా. నాలింగ
  8. తా. ననవకీర్ణియు
  9. ము. యార్య
  10. తా. దుర్బుద్ధియు
  11. తా. ధరియించి
  12. ము. సముండు