పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

క.

శ్రీదయితప్రియసేవక
భూదివిజాశీర్వివృద్ధభూరిశ్రీపు-
ణ్యోదయ సమస్తజనసం-
మోదనసుఖకరవసంత ముమ్మయశాంతా.

1


వ.

అక్కథకుం డిట్లని చెప్పె. నివ్విధంబున నుక్కుమిగిలి ముక్కంటి ప్రమథులు ఘంటాహుడుక్కాడమరు ఢాంకారారవంబుగా వెంటాడించి తోలినఁ బలాయితులై (యమ)కింకరులు వసంతకాలకుసుమిత కంకేళీపాదపంబులభంగి పారిషదవీరఘోరత్రిశూలప్రహరణప్రహారంబులం బ్రభవించు క్రొత్తనెత్తురుల జొత్తిల్లుచు నెదురి కేతెంచిన పరివారంబునకుం బాటిల్లిన పలాయనత్వంబునకు జటాధారుల దౌష్ట్యంబునకు దుర్వృత్తుండగు సుకుమారు నుత్త[మ]పదప్రాప్తికిం జిత్తంబున విషాదంబు నొందుచుఁ జిత్రగుప్తు రావించి కృతాంతుం డతనితో నిట్లనియె.

2


చ.

కవిలియ విచ్చి చెప్పు గణకత్వవిశారద చిత్రగుప్త సం-
భవదశ యాదిగాఁగ సుకుమారుఁడు చేసిన పుణ్యపాపముల్
వివరములైన వేదము[ఖ]విద్యలకుం బదునాలుగింటికిన్
శివుఁడు ప్రబంధకర్తయట నేరక చేసె ననంగ వచ్చునే.

3


వ.

అనినఁ జిత్రగుప్తుండు కవిలియ సమ్ముఖంబునకుఁ దెచ్చి పాయపుచ్చి జంబూద్వీపంబున నార్యావర్తవిషయంబున వింధ్యాచలోత్తరభాగంబున నైరావతీశతద్రూవిపాశా సింధు[1]వితస్తానదీమధ్యంబున హేమాంగదుం డను రాజు రాజధాని రత్నపురంబున యజ్ఞదత్తుం డను బ్రాహ్మణుని భార్య సుశీలకుం బ్రభవించిన కుమారుండు సుకుమారుండు.

4


సీ.

జూదంబు లాడెను శూద్రాన్నము భుజించెఁ
          గలవారి గృహములు కన్నపెట్టెఁ
గొండెంబు చెప్పెను గురుల నిర్భర్త్సించె
          బ్రాహ్మణాచారంబు పదటఁ గలపె
మదిర యాస్వాదించె మాలతొయ్యలిఁ గూడె
          గంజాయి దినె [2]నన్యకాంతఁ జెఱచె
వెలవాడయోషిత్తువలన సంతతిఁ గాంచెఁ
          గన్నకూతు రమించెఁ [3]గావరమున


గీ.

జెంచు సేవించె నిల్లూఱడించుకొనియె
నధిప సుకుమారుఁ డిట్టి పాపాత్ముఁ డనిన
శ్రవణములు మూసుకొనియె హస్తముల యముఁడు
హరహర శ్రీమహాదేవ యభవ యనుచు.

5


వ.

కృతాంతుండు గొంతతడవు విచారించి చిత్రగుప్తుం గనుంగొని.

6


శా.

ఏలా యీ యధమాధికారము పరాధీనత్వదుఃఖాఢ్యమున్
గైలాసంబున కేఁగియుఁ శివుని శ్రీకంఠున్ విరూపాక్షునిన్
త్రైలోక్యాధిపు సంస్తుతించెద మదధ్యక్షత్వచిహ్నంబు [4]ము
గ్రాలంకారము పాదపద్మమణిపీఠాగ్రంబునం బెట్టెదన్.

7
  1. తా. వితస్తానాది మధ్యంబున
  2. తా. కన్యకాంత
  3. తా. గారవమున
  4. ము. ను