పుట:శివతత్వసారము.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఏభంగిఁ దలఁచు భక్తుం
డా భంగిన నీవు నెగడి యవిరళభక్తి
స్వాభావికత్వ పరమ
ప్రాభవవిభవమున నతనిఁ బ్రణుతింతు శివా!

390


క.

తనుఁ గన్న తండ్రి తలఁ దెగఁ
దునిమి భవద్భక్తి యుక్తి ధూర్జటి! యొకఁ డ
త్యనుపమగుణ! నీ పదవికిఁ
జనఁడె ప్రసిద్ధంబుగాఁగఁ జండీశుఁ డజా!

391


క.

తన కన్ను పుచ్చి యొకఁ డ
త్యనుపమమౌ భక్తి నీపదాంబుజములు నే
ర్పునఁ బూజించి సుదర్శన
మను చక్రము వడసెఁగాదె! యచ్యుతుఁడు శివా!

392


క.

శివనిందాశ్రవణమునన్
భవాని తన దేహమాత్మ పావకమునకున్
హవి సేసిగాదె భక్తిని
భవదర్ధాంగమున నుండఁ బడసె మహేశా!

393


క.

శివనింద వింటినని ప్రా
ణవియోగాగ్నిని యథారుణాధరుఁడై కా
దె విరాజితగణపదవికి
భువి నెగడెను వ్యాఘ్రపాదపుత్రుఁడు రుద్రా!

394


క.

దేవ! నిను వీరభక్తిని
బోవక తనతలలు దరిగి పూజించి వడిన్
రావణుఁడు చంద్రహాసము
దేవేంద్రజయంబు వడసెఁ దెల్లము గాదే!

395