పుట:శివతత్వసారము.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

తఱిగిన తలలును నదుకును
మఱి కోసిన నాలుకలును మసలక వచ్చుం
గఱకంఠుని భక్తుల కని
యెఱుఁగరె సద్యఃప్రతావు లీశ్వరభక్తుల్.

187


క.

పుచ్చిన కన్నులు క్రమ్మఱ
వచ్చును దేహంబు తొడిని వ్రస్సిన పుండుం
జెచ్చెరఁ దేరును భక్తుల
కచ్చెరువుగ శివుని మహిమ నతిశీఘ్రమునన్.

188


క.

చేసిన సుకృతము గుడుతురు
భాసురముగఁ గర్ములెల్లఁ బరలోకమునం
జేసి తగఁ గుడుతు రిందుల
నా సకలము నెఱుఁగఁ ద్రిభువనాధిపు భక్తుల్.

189


క.

కలఁ డీశ్వరుఁ డను నమ్మిక
కలవాఁడే శివునిభక్తిఁ గలవాఁడైనన్
మలహరు భక్తులఁ బెద్దలు
కులజులు కులహీను లనఁగ గూడదు వారిన్.

190


క.

నీచులు నీచులు పరిమిత
వాచులు వాచాలు రాత్మవశు లవశులు స్వే
ష్టాచారు లనాచారు [1]
గోచరచరితులు పినాకి కూరిమి భక్తుల్.

191


క.

నియతాత్ము లనియతాత్ములు
నయవినయాన్వితులు నయవినయవర్జితు ల
న్వయజు లనన్వయజులు ని
ర్ణయవిరహితమహిము లఖిలనాయకభక్తుల్.

192
  1. ల ఙ్మానస (పూ.ము.)