ఆంధ్రప్రదేశ్ శాసనసభ,
వెలగపూడి,
అమరావతి.
డా.మండలి బుద్ధప్రసాద్
హృద్యసుందరి శాసనపద్యమంజరి
నన్నయకు బాగా ముందే తెలుగులో పద్యముందని తెలియజెప్పిన శ్రీ జయంతి రామయ్య పంతులు గారు తెలియని తెలుగు చరిత్రకారులు, శాసనపరిశోధకులు, సాహితీమూర్తులు వుండరంటే అతిశయోక్తి కాదు. యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో తెలుగుపద్యా లున్నాయని మొట్టమొదటిసారిగా చెప్పింది ఆయనే. శాసనాలను సేకరించి, పరిష్కరించి, దక్షిణభారతశాసనసంపుటి పేరిట ప్రచురించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆంధ్రసాహిత్యపరిషత్తు ఏర్పాటులో కీలకపాత్ర పోషించటమేకాక, ఎన్నో శిలాశాసనాలను ఆ సంస్థ పత్రిక ద్వారా వెలుగులోకి తెచ్చి తెలుగువారి చరిత్రను సుసంపన్నం చేశారు. తనకున్న ఆసక్తి కొద్దీ అనేకశాసనాల నకళ్ళను ముందేసుకుని, వాటిలోని పద్యాలను గుర్తించి, గణవిభజన చేసి, ఛందస్సుతో పాటు రెండుభాగాలుగా 'శాసనపద్యమంజరి' అనే పుస్తకాలను ప్రచురించి తెలుగు చారిత్రకసాహిత్యజగత్తుకు ఎనలేనిసేవ చేశారు.
1930, 1937 సంవత్సరాల్లో వరుసగా జయంతి రామయ్య పంతులుగారి శాసనపద్యమంజరి మొదటి, రెండు భాగాలు ముద్రించబడి ప్రజల మన్ననలు పొందాయి. ఆ పుస్తకాలు ఇపుడు అందుబాటులో లేనందువల్ల ఈతరం పరిశోధకులకు అందించాలనే ఉద్దేశంతో పురావస్తుపరిశోధకులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి, సీఈవో, డా॥ ఈమని శివనాగిరెడ్డి-స్థపతి, కృష్ణాజిల్లా రచయితలసంఘం కార్యదర్శి, డా॥ జి.వి.పూర్ణచందు, శాసనపరిశోధకులు డా॥ కొండా శ్రీనివాస్ లు ఈపుస్తకపునర్ముద్రణకు పూనుకోవటం హర్షించదగ్గవిషయం. ఈ సందర్భంగా వారిని నేను అభినందిస్తున్నాను.