(గ) అనుస్వారపూర్వకాక్షరము పెక్కుతావుల ద్విగుణీకరింపఁబడినది. అట్లు కానిచోటులునుం గలవు.
(జ) సంయుక్తాక్షరములలో రేఫపరక మగునక్షరము తఱచుగ ద్విగుణీకరింపఁబడినది. ఉదా:- కర్త్త (58-2) ధర్మ్మంబు (58-3).
(డ) క్రావడి యుండవలసినచో శకటరేఫ ముండుట. ఉదా:- వణ్ఱె(1) చెబ్ఱోలనుణ్డి (2-4).
(ద) ...స్సి, అ... సిన (2-3) ఇత్యాదిశబ్దములందు ... యను వింతయక్కర మొక్కటి కనఁబడుచున్నది. ఇది యఱవములోని ..., కన్నడములోని ... యనునక్షరములకు సజాతీయమైనది. దీనియుచ్చారణ మిప్పుడు డకారోచ్చారణముగా మాఱినది. ఈయక్షరమును గూర్చిన విమర్శన మాంధ్రసాహిత్యపరిషత్పత్రికలోఁ గననగు.
పైనుదాహరింపఁబడిన వర్ణక్రమదోషముల నన్నింటిని సవరించినచో గ్రంథవిస్తర మగునని విడిచిపెట్టినారము. పాఠకులు యథోచితముగ సవరించుకొనవలయును.
II. శబ్దలక్షణమునకు సంబంధించిన ప్రయోగవిశేషములు
1. సంస్కృత శబ్దములు కొన్నింటికి లక్షణవిరుద్ధములైన రూపములు కనఁబడుచున్నవి.
(క) కల్హారగంధి యనుటకు బదులుగా కలుహారగంధి యని (15-3).
(చ) కమలనేత్రి (3-1) వనజనేత్రి (4-1) విశాలనేత్రి (5.5) అంభోరుహనేత్రి (15-3) ఇత్యాదిస్థలములందు నేత్ర యనుటకు నేత్రియని ప్రయోగించుట.
(ట) వల్లభ యనుటకు బదులుగా వల్లభి యనుట (4-1, 5-3)
(త) బాలిక యనుటకు బదులుగా బాలకి యనుట (5-5)
(ప) ఉదయించె ననుటకు బదులుగా ఉదియించెనని తఱచుగాఁ గన్పట్టుచున్నది.
(గ) అకారాంతశబ్దములకు డుప్రత్యయము పరమైనప్పుడు ప్రకృతిరూపమందలి చివరియకారమున కుకారము రాకుండుట - బ్రహ్మదేవండు (40-3,5) శరణండు (46-14) భీమర్ని (48-2) మల్లిదేవండు (58-12,13).
2. డుప్రత్యయంతశబ్దములు కొన్ని డుప్రత్యయము లేకయే కనఁబడుచున్నవి. చోడుఁడు అనుటకు బదులు చోడు (58-7) తమ్ముఁడు అనుటకు బదులు తమ్ము (58-15, 16)
3. నన్నయ భట్టారకుని కవిత్వమందుఁ గల ప్రయోగవిశేషములు కొన్ని యీశాసనములందుఁ గనుపట్టుచున్నవి.