పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

శిరము నీవు నీది శిరమొ యయ్యుదరంబు, నీవొ యుదర మెన్న నీదియొక్కొ
అంఘ్రిబాహుముఖ్యమగునంగకము లీవొ, అదియె నీదియో మహాత్మ చెపుమ.

238


క.

తలఁప సమస్తావయవం, బులకు న్వేఱైన నీవు భూపాలక యే
యలవున నే నని చెప్పం, గలవాఁడవు నిపుణబుద్ధిఁ గనుమా తెలియన్.

239


వ.

ఇవ్విధంబునఁ దత్వస్థితి వర్తింప నే నిట్టివాఁడనని యెట్ల చెప్ప నేర్తునని యాబ్రాహ్మ
ణుండు పలికిన పరమార్థసమన్వితంబులగు పలుకులు విని పులకించి యాభూపాల
తిలకుం డిట్లనియె.

240


సీ.

శిబిక నే మోవను శిబిక నాపై లేదు, నాకన్న దేహ మన్యంబు శిబిక
దేహంబు మోచె నింతియ భూతముల కెల్ల, కర్మచోదితవృత్తి కలిగియుండు
కర్మవశ్యత గుణగ్రామంబు దిరుగ నే, పని లేదు నా కని పలికి తిప్పు
డిదియెల్ల విని నాదుమది విహ్వలించెనో, పరమార్థతత్వజ్ఞభవము రోసి


గీ.

కపిలమునిఁ జేరి పరిమార్థకలనఁ దెలుతు, ననుచుఁ జనుచోటఁ దెరువును వినుతతత్త్వ
బోధనిధి నిన్నుఁ గంటి నాపుణ్యమహిమ, కలిమి నిరుపేద పెన్నిధిఁ గన్నయట్లు.

241


వ.

సర్వభూతేశ్వరుండైన విష్ణుడు జగద్రక్షణార్థంబు కపిలుండై యవతరించె.
అమ్మహానుభావుండ నన్ను రక్షించుటకు నీరూపంబునఁ బ్రత్యక్షంబగుట
సిద్ధంబు. నాకు నెయ్యది పరమార్థంబైన శ్రేయస్సు దాని నెఱింగించి రక్షింపు
మని ప్రణతుఁడైన సౌవీరపతిం జుచి బ్రాహ్మణుం డిట్లనియె.

242


క.

ఇలలోఁ బరమార్థార్థం, బులు శ్రేయము లెన్నియైన భూవర కల వం
దుల కొలఁది యెన్ని చూచినఁ, బలుకులు వెయ్యేల యవియుఁ బరమార్థములే.

243


గీ.

ధరతనయ రాజ్యలాభంబు తలఁచి నరుఁడు, దేవతారాధనము చేసి దీనిఁ గాంచు
ధరణినాయక మనమునఁ దలఁచిచూడ, నదియుఁ బరమార్థమైన శ్రేయంబుగాదె.

244


చ.

తలపఁగ స్వర్గలోకఫలదాయక మౌ క్రతుకర్మ మెంచఁగాఁ
గలిగిన శ్రేయమౌఁ గద, యకంపితయోగసమాధి నాత్మునిం
గలయఁగఁ జేర్చు శ్రేయ మది గాదొకొ భూపలలామ పెక్కువా
క్కుల పని యేమి శ్రేయములకున్ మితి లేదు తలంచిచూచినన్.

245


వ.

పరమార్థంబైన శ్రేయస్సు సంక్షేపరూపంబునం జెప్పెద. ఏకుండును, వ్యాపియు,
సముండును, శుద్ధుండును, నిర్గుణుండును, ప్రకృతికంటెఁ బరుండును, జన్మ
మృత్యాదిరహితుండును, సర్వగతుండును, నవ్యయుండును, బరమజ్ఞానమ
యుండును, నామజాత్యాదివియుక్తుండును నైన పరమాత్ముని నెఱింగిన
జ్ఞానంబు పరమార్థంబైన శ్రేయస్సు. అని చెప్పిన విని మనంబున సంచలించి