పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

ధవళహయంబు లెన్మిది యుదగ్రతఁ గట్టిన పైఁడితేరిపై
దివిజపురోహితుండు సముదీర్ణతతోడ వసించి యేటియే
టివరుస నొక్కటొక్కటిగ ఠీవిని రాసులు త్రొక్కుచుండుఁ బ్రా
భవమున భూజనంబులకుఁ బ్రస్ఫుటశోభనముల్ ఘటించుచున్.

164


గీ.

శబలవర్ణంబు లాకాశసంభవములు, నైనయెనిమిదిగుఱ్ఱంబు లానియున్న
స్యందనం బందముగ నెక్కి మందమంద, గమనమున సూర్యసుతుఁ డేగు గగనవీథి.

165


క.

ఎనిమిదినల్లనిగుఱ్ఱము, లనువుగ వహియించు ధూసరాభరథము పెం
పెనయంగ నెక్కి రాహువు, దినదినమును నభ్రవీథిఁ దిరుగుచునుండున్.

166


క.

ధూమలరుచి లాక్షావ, ర్ణామితవేగంబునైన నశ్వాష్టక ము
ద్దామగతిఁ బూన్చునరదము, పై మెలఁగున్ గేతు వభ్రపదమున నెపుడున్.

167


వ.

ఇది నవగ్రహంబులరథంబులతెఱంగు.

168


క.

రవిఁ బట్టి విడుచుఁ బదపడి, ధవళకరునిఁ బట్టి విడుచుఁ దత్తత్పర్వ
ప్రవరసమయముల రాహువు, దివి నవిరతవక్రగమనదీపితుఁ డగుచున్.

169


వ.

ఈనక్షత్రగ్రహతారలు రానులు నన్నియు ధ్రువునియందు వాతరశ్మిబద్ధం
బులై ధ్రువునిం ద్రిప్పుచు తామునుం దిరుగుచుండు. ఈధ్రువాదులకు
నాధారంబు శింశుమారం బని యెఱుఁగుము. ఈశింశుమారదర్శనంబు చేసి
పాపంబులం బాసి యాయుష్మంతు లగుదురు.

170


క.

వనజాతపత్రనేత్రుఁడు, మునిపుంగవ శింశుమారమూర్తిధరుండై
వినువీథిఁ దిరుగు నెప్పుడు, వినుము తదీయప్రభావవిశ్రుతమహిమల్.

171


వ.

ఆశింశుమారంబునకు నుత్తరహనువున నుత్తానపాదుండును, అధరంబున
యజ్ఞంబును, మూర్ధంబున ధర్మంబును, హృదయంబున నారాయణుండును,
పూర్వపాదంబుల నశ్వినులును, పశ్చిమపాదంబుల వరుణార్యములును,
శిశంబున సంవత్సరంబును, అపానంబున మిత్రుండును, పుచ్ఛంబున నగ్ని
మహేంద్రకశ్యపధ్రువులును నుండుదురు. పుచ్ఛాశ్రయంబైన యీనక్షత్ర
చతుష్టయంబును నస్తమయంబు నొందదు. ఇది సమస్తజ్యోతిస్సన్నివేశంబు.

172


గీ.

భువనములు జ్యోతిరుచ్చయంబులు వనంబు, లద్రులు దిశల్ నదీసముద్రాదికములు
అస్తినాస్తిపదార్థవేద్యములు నంబు, జాతనేత్రుండుసుమ్ము విఖ్యాతచరిత.

173


వ.

అశేషజగన్మూర్తియైన భగవంతుండు జ్ఞానస్వరూపుండు గాని వస్తుభూతుం
డు కాఁడు. కావున జగంబంతయు జ్ఞానస్వరూపంబు.

174