పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

భాతిం దూర్పుననుండి దక్షిణదిశా ప్రత్యగ్దిశోదగ్దిశా
స్ఫీతద్యోతవితానుఁడై పటుధనుఃక్షిప్తాశుగాశుక్రియల్
చేతోమోదముగాఁ బ్రదక్షిణముగాఁ జిత్రస్థితిం ద్రిమ్మరున్
జ్యోతిశ్చక్రసమేతుఁడై యెపుడు ఖద్యోతుండు విప్రోత్తమా

113


వ.

అహోరాత్రవ్యవస్థానకారణంబు భగవంతుండైన హరియ కానెఱుంగుము.
ఉత్తరాయణంబు యోగులకు సకలక్లేశసంక్షయకరంబైన దేవయానపథం
బగు మార్గంబు. సర్వకాలప్రభావుండగు సూర్యునకు నుదయాస్తమయంబులు
లేవు. ఏదీవివారి కెచటం గానంబడియె నాదీవివారి కచట నుదయింబు ఎచ్చటం
గానంబడక యుండు నది యస్తమయంబు. దర్శనాదర్శనంబుల, యుదయా
స్తమయంబులు. అర్కుడు శక్రాదులపురంబున నుండి పురత్రయంబు స్పృ
శింపుచుం జను. పురోభాగం బెంతదవ్వు తపించు పృష్ఠపార్శ్వభాగంబులయందు
ను నంతమేర తపించు. ఊర్ధ్వభాగంబున మేరూపరిభాగమ్మున నున్న బ్రహ్మ
సభం దపింపలేఁడు. బ్రహ్మసభాతేజఃప్రతిహతంబులై సూర్యకిరణంబులు మగు
డంబడు వినుము.

114


చ.

రవికిరణంబు లెప్పుడును రాత్రులయందు హుతాశుకీలలన్
దలివి వసించు నట్లన పదంపడి వహ్నియు భానుఁ జెందు తా
దివములయందు నట్లగుట దీధితి రేలుఁబగళ్లు వహ్నికిన్
రవికిని మిక్కుటంబగు సనాతనధర్మధురీణవర్తనా.

115


వ.

అగ్నిసూర్యులు పరస్పరానుప్రవేశంబున నాప్యాయనంబు నొందుదురు
ఉత్తరాయణ దక్షిణాయనాత్మకంబగు సంవత్సరంబు దేవతలకు నొక్క
యహోరాత్రం బగు. అందు.

116


ఉ.

తుంబురునారదాదు లతిదోహలు లై తనకీర్తి పాడ ది
వ్యాంబుజలోచనాశతము లాడ జగంబులు వేడ్కఁగూడ న
య్యంబరమధ్యవీథిఁ గమలాప్తుఁడు ద్రిమ్మరు నంశుమండలీ
చుంబితసర్వదిక్కుఁ డగుచున్ వడిఁ గుమ్మరిసారెకైవడిన్.

117


గీ.

ఉష్ణకరుఁ డుత్తరాయణం బొందునపుడు, మకరమున కేగునంత కుంభంబు నొందు
మీనమేషవృషంబుల కానుపూర్వి నరుగు, నామీఁద మిథునంబు నాశ్రయించు.

118


ఉ.

కర్కటకంబు ద్రొక్కి కుతుకంబు దలిర్పఁగ సింహకన్యలం
దార్కొని త్రాసుపై నిలిచి తాలిమి వృశ్చికచాపయుక్తుఁడై
అర్కుఁడు దక్షిణాయనపథాధరణమ్మునఁ ద్రిమ్మరున్ శుభో
దర్కగతిం గ్రమాన్వయము దప్పక చెప్పఁగరాని వేడుకన్.

119