పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

జనలోకమునకు నవ్వల నొనరుఁ జతుష్కోటియోజనోత్సేధమునన్
వినుతతపోలోకము సజ్జననుతవైరాజదేవసంఘవసతియై.

96


వ.

సూర్యకిరణదాహవర్జితులై వైరాజనామధేయదేవత లాతపోలోకంబున
నుండుదురు.

97


గీ.

అనుపమంబై తపోలోకమునకు మీఁద నాఱుకోటులపొడవున నతులగతులఁ
బొగడు గను సత్యలోక మద్భుతవిభూతి యదియె బ్రహ్మకు లోకంబు సదయహృదయ.

98


వ.

ఆసత్యలోకంబున నపునర్జాతకులు వసియింతురు.

99


క.

పాదాభిగమ్యమై భువి నేది వెలయుచుండు దాని నెఱుఁగుము నీ వ
త్యాదృతి భూలోకం బని భూదేవకులాగ్రగణ్య పుణ్యచరిత్రా.

100


వ.

ఆభూలోకప్రకారంబు నీ కెఱింగించితిం గదా యని చెప్పి మఱియు నిట్లనియె.

101


మునిసిద్ధసేవితంబై యనఘంబై భూదివాకరాంతర్గత మై
పెనుపొందు భువర్లోకం బనవద్య ద్వితీయలోక మదియే సుమ్మీ

102


క.

రవిమండలంబు మొదలుగ ధ్రువమండలిదాఁక, పెంపుతో వెలయు ముని
ప్రవర! చతుర్దశలక్షము సువరాహ్వయలోక మఖిలసురసేవ్యంబై.

103


సీ.

భూర్భువస్వర్లోకములు మూఁడు కృతకముల్, జనతపస్సత్యసంజ్ఞములు మూఁడు
నకృతికంబులు, కృతకాకృతకము మహర్లోకంబు, విను మునిలోకవినుత
యిట్లు మీఁ దేడు క్రిం దేడులోకంబులు, నమరు బ్రహ్మాండమధ్యమున నట్టి
యండంబుబైట సప్తావరణంబులు, దశగుణోత్తరములై తనరు నవియు


గీ.

జలదహనమారుతాకాశములు నహంక్రి, యామహిత్ప్రకృతులు జుమ్మునీమది నిది
దలఁపుము, కపిత్థబీజసంతతులఁ గప్పుచిప్పచందంబు గాఁగ, నూర్జితవివేక.

104


అల కృతకాకృతకాఖ్యం, గలలోకము శూన్యమునను గల్పాంతమునన్
పొలుపరి చెడు నత్యంతః, ప్రళయంబున నది వివేకపాకనిధానా.

105


గీ.

అకృతకంబులు మూఁడు నత్యంతవిలయ, సమయమున నాశ మొందు సంయమివరేణ్య
కృతకములు మూఁడు కల్పాంతహతము లగును, తెలియు మవ్విధ మెల్ల సందియము దీర.

106


వ.

ఆబ్రహ్మాండంబునకు దశగుణోత్తరంబులై సప్తావరణంబు లుండు. అనంతంబగు
ప్రధానంబున కంతంబు లేదు. ఆప్రధానంబు కదా సమస్తంబునకు హేతుభూ
తమైన ప్రకృతి యనంబరఁగు. ఆప్రకృతియందుఁ గోట్యయుతసంఖ్యాతంబులైన
యండంబు లావృతంబులై యుండు. దారువునందు నగ్నియు తిలలయందు తైలం