పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

 హరిణకరిహరిచమరంబు లక్ష్మికుంభ, మధ్యవాలాకృతులు దెచ్చి మనుపుకొఱకు
భిల్లపతియింట గిరువులు పెట్టె ననఁగ, దృక్కుచవలగ్నచికురచారిమల నొప్పు.

113


గీ.

పట్టెఁడేసికుచంబులపై ధరించి, కందుకక్రీడ గావించు ఘర్మవారి
గరఁగిడిగ జాఱ నవగైరికద్రవంబు, గిరులఁ బ్రవహించుధాతునిర్ఝరము లనఁగ.

114


గీ.

చన్నుగుబ్బలపోరాటఁ జక్కపెట్టఁ, బోయి మధ్యస్థభావంబు పొందలేని
కతన లజ్జించె ననఁగ మొగాలు నల్లఁ, బారుగురువిందపూసలపేరు వైచు.

115


క.

క్రిక్కిఱిసినబింకపుఁజను, జక్కవకవఱెక్క లనఁగ సకియలు దనకున్
మక్కువ నీ నొక్కొకమరి, పెక్కులు మెడఁ దాల్చు మంచిపించెపుదండల్.

116


గీ.

గ్రహణభయమున రవిసుధాకరులు హీను, లై చికురబంధరాహుగ్రహంబుకడకు
శరణు వేఁడంగ వచ్చినచాడ్పు దోఁపఁ, బెట్టు సిందూరమునఁ జుక్కబొట్టు నొసల.

117


వ.

ఇవ్విధంబున నారూఢయౌవనవిజృంభంబున దృక్కరంభం బైననిజతనూజ నర్జున
కిం జూచి దూరీకృతవిరోధుండు ధర్మవ్యాధుండు దీనికిం దగినవరుం డెవ్వండు
గలుగునో యని చింతించుచు మతంగమునికుమారుండు ప్రసన్నుం డనువాఁడు
సకలవిద్యాప్రసన్నుం డని విని వానికి వివాహంబు సేయునీహ నక్షీణపుణ్యలక్షణ
గేహ నవ్వరారోహఁ గొంచు దుష్కృతంబులకుం గొంచుచెంచులు వెంట రా నిరా
యాసంబునం జని లవంగసారంగపూగ పున్నాగవకుళకురువకప్రియాళురసాలప్ర
ముఖసాలవికాసమాననూనవాసనాసనాధగంధపవమాననిరస్తసమస్తపాంథశ్రమం
బగునాశ్రమంబు దఱిసి ముందట సరోవరతీరంబున బహుశిష్యగణంబులతోడ
నాహ్నికక్రియాకలాపంబులు దీర్చి వేదాంతశాస్త్రవ్యాఖ్యానగోష్ఠి నున్నమతం
గునిఁ గనుంగొని యి ట్లనియె.

118


మ.

అనఘస్వాంత మతంగసంయమివరేణ్యా నాతనూజాత న
ర్జునకీకన్యకఁ దెచ్చినాఁడ రమణీచూడామణిన్ మీప్రస
న్నునకుం జేయుదమా వివాహ మిఁక నెందుం జూచినం గల్గ రా
యన దక్క న్మునిరాజనందనులు కన్యాదానయోగ్యుల్ వరుల్.

119


చ.

అనవుడు నట్లకాక తగు నాటవికాన్వయసార్వభౌమ నీ
తనయ మదీయపుత్రునకు ధర్మకళత్రముగా నటంచు నా
తనిఁ దనపర్ణశాలకు మతంగమహామునిపుంగవుండు తో
డ్కొని చని చూపెఁ బెండ్లికొడుకు న్మితభాషణు వంశభూషణున్.

120


వ.

తత్సమయంబున.

121


క.

సతి చూచెను యతిసుతునిన్, యతిసుతుఁడు న్సతిఁ జూచె నంగజుఁడు సతీ
యతిసుతుల నేసెఁ గొసరక, లతాంతశరజాలముల హళాహళి గాఁగన్.

122