పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నీరసముద్రంబులనడుమ శ్వేతద్వీపంబు దీపించుఁ బాలసముద్రంబునకు రెట్టియైన
తియ్యనినీటిసముద్రంబునకు నవ్వల లోకాలోకపర్యంతంబు దానికి నవ్వలం గటా
హంబు నదియ పంచాశత్కోటివిస్తీర్ణం బైనభూచక్రంబునకుం గడసీమ భువర్లో
కాదిసత్యలోకపర్యంతం బైనయూర్ధ్వలోకంబు లాఱునుం గూడి పంచాశత్కోటి
పరిమాణంబు లిట్లు బ్రహ్మాండగోళంబు శతకోటివిస్తారం బిట్టిబ్రహ్మాండంబు లసంఖ్యం
బులు ప్రతికల్పంబున నేకోదకమగ్నంబు లైనబ్రహ్మాండంబుల నారాయణుండు
వరాహరూపంబున రసాతలంబువలన నుద్ధరించి మున్నటియట్ల నిలుపుచుండు మహా
త్మలార యిట్లు భూగోళప్రకారంబు చెప్పితి మీకు భద్రం బౌ నని రుద్రుం డాన
తిచ్చి వియచ్చరు లచ్చెరుపడ సపరివారంబుగా నదృశ్యుం డయ్యె నని కుంభసంభ
వుండు భద్రాశ్వునకుం జెప్పె నని వరాహదేవుండు చెప్పిన విని రసాసారసానన
తరువాతివృత్తాంతం బానతి మ్మని విన్నవించిన.

178


మ.

 ప్రకటీభూతచమూసమూహరభసాక్రాంతప్రతీపక్ష్మ ప
క్ష్మకవాటద్వయవత్పురార్యళికదృక్ప్రాకారసంలీనపా
వకలజ్జావహదోఃప్రతాపగరిమవ్యాప్తాఖిలాశాంతరా
ళ కరాళాహిశయానశౌరిసుఖతల్పస్వాంతనీరేరుహా.

179


క.

ఆరట్టతురంగమధా, టీరేణుపరంపరాఝడితిశోషితవీ
రారివధూజనకరిమక, రీరచనాసంగతాంగశృంగారాబ్ధీ.

180


పృథ్వి.

త్సరుస్థకనకచ్ఛవిస్థగనజాతరూపాంబుజ
స్ఫురత్కరకృపాణికాదళితశూరపృధ్వీతలే
శ్వరౌఘకృతభేదనశ్రమభవభ్ర ప్రస్ఖల
త్ఖరాంశునికటావలంబననిధానదండధ్వజా.

181

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబునందు దశమాశ్వాసము.