పుట:లీలావతీగణితము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నామిత్రులు బ్ర. పిడపర్తి కృష్ణమూర్తిశాస్త్రిగారు గణితశాస్త్రమునం దిట్టి కొఱంతను బాపదలచి సుప్రసిద్ధలీలావతీగణితము నాంధ్రీకరించియుండిరి. జ్యోతిశ్శాస్త్రమందు వారిప్రజ్ఞ యాంధ్రలోకమునకె కాక యితకులకును దెలిసిన విషయమే. గణితశాస్త్రమునందు లేశమాత్రము ప్రవేశములేనివారికి గూడ నతిసులభముగ బోధపడునట్లు వారు రచించిన వ్యాఖ్య వర్ణనాతీతము. ఆంగ్లభాషాభ్యాసవశమున నాభాషాసాంప్రదాయముల ననుసరించిగాని యవగాహన చేసికొన జాలని యాధునిక యువజనులకు గూడ నాశ్చర్యజనకమగు రీతిని క్లిష్టవిషయములను కరతలామలకముల గావించిరి.

దీనివలన ప్రాచీనవిద్యాగౌరవోన్నతులు గోచరింపక తప్పవు. గణితశాస్త్రమునందు ముఖ్యముగ బీజగణిత రేఖాగణితములందును ఖగోళశాస్త్రమునందును పూర్వులు సల్సిన కృషి యత్యద్భుతమై పాశ్చాత్యవిజ్ఞానమున కేమాత్రము దీసిపోవునది కాదని తెలిసికొనదగినట్లు బోధింపగల శ్రీ కృష్ణమూర్తిశాస్త్రిగారి బోధనశక్తియు నపారమే. ఇంకను జ్యోతిశ్శాస్త్రగ్రంథముల నాంధ్రమున పరివర్తనముచేసి దేశోపకారము కావించునటుల నాంధ్రులు వారికి ప్రోత్సాహము కలిగింపవలసినవిధి యై యున్నది. ఇట్టి యుత్తమగ్రంథము లింకను వివిధశాస్త్రముల వెలువడినయెడల భాషాదారిద్ర్యము తొలగి మాతృభాషయందే యుత్తమవిద్య గఱపుటకు విశ్వవిద్యాలయములకు సాధ్యమగును. ఆ మూలమున దేశోన్నతియు, భాషాసేవయు, విద్యార్ధిజనమునకు కేవల మనుకరణపద్ధతులే కాక మౌలికపరిశోధనశక్తియు వికాసమును లభ్యము లగును. భారతీయులకు స్వతంత్రవిజ్ఞానశక్తి కొలదిమాత్ర మను నపవాదయు నశించును. విజ్ఞానసంపద పెంపు వహించును. కళాశాలలయం దిట్టి యుత్తమగ్రంథములు పఠనీయములుగ చేయదగును.

(Sd.) ప్రభల లక్ష్మీనరసింహము,

అడ్వకేటు.