పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

నిరతము తావకాంఘ్రియుగనీరజభక్తిఁ జెలంగునన్ను నో
పురుషవరేణ్య రుక్మి యనుబుద్ధివిహీనుఁడు క్రొవ్వి చేదిభూ
వరుఁ డనుదోసకారికి వివాహము సేయఁ దలంచుచున్నవాఁ
డరయఁగ నక్కపోతునకు సబ్బునె బెబ్బులిసొ మ్మొకింతయున్.

73


క.

ఉడుగనియాసలఁ దము నె,య్యెడ నమ్మినసాధుజనుల నేఁచెడుఖలులన్
దొడరి వధింపక యూరకె, విడువరుగద యెందునైన వీరవరేణ్యుల్.

74


తే.

తడయఁ బనిలేదు వేవేగఁ దరలి వచ్చి, కలన శిశుపాలమాగధాదుల జయించి
రాక్షసవివాహమునఁ బయోజాక్ష నన్నుఁ, గైకొనుము శౌర్య ముంకువగా నొనర్చి.

75


తే.

రాజశుద్ధాంతసౌధాంతరమున మెలఁగు, నిన్ను నేక్రియఁ దేవచ్చు నిఖిలబాంధ
వుల వధింపకకా కని తలఁచెదేని, విను ముపాయంబు చెప్పెద వనజనయన.

76


క.

కులదేవియాత్ర యొనరిచి, వలనుగఁ బురి వెడలి శివునివనితకు మ్రొక్కం
జెలఁగి తమవారు పంపుదు, రెలమిం బెండ్లికిని ముం దహీనచరిత్రా.

77


తే.

అట్లు శివవల్లభకు మ్రొక్క నరుగుతఱిని, సరగఁ బఱతెంచికొనిపొమ్ము కరుణఁ జేసి
కాక నీమది నశ్రద్ధగాఁ దలంచె, దీని నామీఁదిపని నాకె తెలియుఁజుమ్ము.

78


మ.

అని నీచెంగట విన్నవింపు మని యయ్యబ్జాస్య పుత్తెంచె నో
జననాథోత్తమ జాగు వ ల్దిఁకఁ జమూసంఘంబులం గూడి గొ
బ్బున వేంచేయుము కుండినేంద్రసుతి నంభోజాతనేత్రిం జగ
జ్జనసంస్తుత్యచరిత్రిఁ గైకొనుటకున్ సంతోషచిత్తంబునన్.

79


క.

ఆకాంతాజనరత్నము, నీకుఁ దగుం దగుదు నీవు నృపకన్యకకున్
మీ కిరువురకుం గూర్చిన, యాకమలజుప్రోడజాడ లలవియె పొగడన్.

80


క.

ఓచక్రధర నిజంబుగ, భూచక్రమునందుఁ గల్గుపొలఁతులు తులగా
రాచక్రస్తనితో మఱి, యాచక్రియుఁ బొగడఁ జాలఁ డబలగుణంబుల్.

81


క.

వన్నెలనెల వన్నెలఁతుక, వెన్నెలదొర కళ యనన్ భువిన్ విలసిల్లున్
కన్నులు విరిదమ్ములు చెలి, కన్నులు తుల యెందుఁ జెంద రంబుజనాభా.

82


క.

కుందము లాదంతము లర, విందము లాపదము లుదధివిలసద్వీచీ
బృందము లావళు లలరు మి, ళిందము లాకుంతలములు లీలావతికిన్.

83


సీ.

భృంగముల్ సింగముల్ తుంగగంగాసరిద్భంగముల్ మత్తచక్రాంగములును
జిందముల్ కుందముల్ సుందరేందీవరబృందముల్ వికచారవిందములును
క్షీరముల్ కీరముల్ సారసౌరభ్యకల్హారముల్ ఘనఘనసారములును
వ్యాసముల్ శైలముల్ శ్రీల నోలాడుమృణాలముల్ చంపకజాలములును


తే.

దుల యగునె దానికచమధ్యనళిసుయాన, గళరదననేత్రముఖహాసలలితవచన
కరవపుర్గంధరోమాళిగురుకుచభుజ, నాసలను బోల్ప నింతైన నలిననయన.