పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

హరినఖరదారితోన్మదద్విరదకుంభ, గళితముక్తావళుల్ వడగండ్లగములు
గాఁగ వర్షాగమంబు వైఖరిని దనరు, నవ్వనస్థలి దాఁటి యత్యాశుగతిని.

7


చ.

చనిచని ధారుణీవిబుధచంద్రుఁడు ముందర డెంద ముబ్బఁగాఁ
గనుఁగొనె నక్రకర్కటకకచ్ఛపమత్స్యపదర్దురోద్రమున్
ఘనతరరత్నజాలపరికల్పితభద్రము నిర్మలోర్మిక
నినదకదంబసంతతవినిద్రముఁ బశ్చిమదిక్సముద్రమున్.

8


ఉ.

ధీవరకోటి కెప్పుడు నదీనము చేరి ఘనుల్ వసించినన్
జీఐన మిచ్చుధన్యుఁడు ప్రసిద్ధి వహించిన బాడబాశ్రయుం
డావనరాశి భూసురున కర్ఘ్యముఁ బాద్య మొసంగె నూర్మికా
పావననీరబిందువులు పాదయుగంబునఁ జిల్కరించుచున్.

9


క.

వేలానిలదేలామల, జాలాఖిలసుమసమూహసౌరభలహరీ
లీలాకులబాలానిల, మాలావిలసనము లార్యుమది నలరించెన్.

10


చ.

ఉదధిమహారవంబు లపు దుర్విసురాధిపుఁ డాలకించి తా
మదిఁ దలఁచెన్ యదూద్వహునిమందిరదేశమునందు ముందుగా
సదమలదుందుభిధ్వనులు సాగెఁ గదా శుభసూచకంబు లై
కొదవ యిఁకేమిలేక సమకూరెఁ బ్రయోజన మంచు నుబ్బుచున్.

11


చ.

తటవిటపిప్రసూనకలితభ్రమరారవముల్ సుగీతముల్
పటుతరఘూర్ణితధ్వనులు ధన్యమృదంగనినాదముల్ సము
త్కటజలపక్షిరావములు కాంస్యపుఁదాళములై చెలంగఁగా
నటన మొనర్చుమానిను లనం దగి వీచిక లొప్పె నీరధిన్.

12


తే.

హరిహయునివజ్రధారకు వెఱచి యమిత, వాహినీనాథుఁ డంచు నవ్వారిరాశి
యండఁ జేరుక నిల్చినకొండ లనఁగ, నిసుకతిన్నియగములు సొం పెసఁగె నచట.

13


క.

సందరమున నురు వలరె ము, కుందుని పెండ్లికిని బిలుచుకొఱ కరిగెడుభూ
బృందారకుఁ గన్గొని యా, నందంబున నప్పయోధి నవ్వె ననంగన్.

14


తే.

మీనవృశ్చికకర్కటమిథునమకర, హరివృషాదులు రాసులై యలర నుడుప
తరణు లిందులఁ జరియించు టరుదె యనుచు, నెంచె దైవజ్ఞమణి యామహీసురుండు.

15


ఉ.

వాలికమీలఁ జట్టుచు నవారితకౌతుకలీలఁ దేలుచో
మేలఁగుగుబ్బచన్గవమీఁదిపయంటలు జాఱి యున్న లేఁ
జాలరిముద్దుగుమ్మలకుచంబులు బంగరుచెంబు లన్మదిం
జాలఁగ నిచ్చఁ గన్గొనియె ఛాందసుఁ డజ్జలరాశిచెంగటన్.

16


సీ.

బహుతరవాహినీపరివృతుఁ డయ్యును గడు నబ్బురముగ భంగంబు నొందె
ఘనులకు జీవనం బొనఁగూర్చుచుండియు సంతతంబును గలుషత్వ మూనెఁ